హైదరాబాద్‌: మాజీ భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా బుక్కైన వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. తనను హత్య చేసేందుకు తన మాజీ భర్త సాయికిరణ్ ప్రయత్నిస్తున్నాడని బోరబండకు చెందిన స్వర్ణ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బోరబండ రాజేంద్రనగర్ లో స్వర్ణ వెళ్తుండగా హత్య చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు సాయికిరణ్. సాయికిరణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిందితుడు నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

నిందితుడిని పోలీస్ స్టేషన్ ఆవరణలో కూర్చోబెట్టి పోలీసులు వేరే కేసు విషయంపై చర్చిస్తున్నారు. ఇంతలో నిందితుడు సాయికిరణ్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. 

సాయికిరణ్ మాజీ భార్య స్వర్ణకు సైతం పోలీసులు సమాచారం ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో తప్పించుకుని తిరుగుతున్న సాయికిరణ్ ను పోలీసులు పట్టుకున్నారు. అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పీఎస్ కు తరలించారు. 

ఇకపోతే బోరబండకు చెందిన స్వర్ణకు సాయికిరణ్ కు గతంలో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో వారు విడిపోయారు. ప్రస్తుతం స్వర్ణ తన ఇద్దరు పిల్లలతో కలిసి రాజేంద్రనగర్‌లోని తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది.  

ఆమెపై కోపం పెంచుకున్న మాజీ భర్త సాయికిరణ్ ఎలాగైనా ఆమెను మట్టు బెట్టాలని పథకం పన్నాడు. అందులో భాగంగా శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్వర్ణ నివాసం ఉండే కాలనీలో సంచరిస్తుండగా అనుమానం వచ్చిన ఆమె డయల్ 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి

మాజీభర్త హత్యప్లాన్ ను ముందే పసిగట్టిన మహిళ, దాడి నుంచి ఎలా తప్పించుకుందంటే....