హైదరాబాద్‌: విడాకులిచ్చిన భార్యపైకక్ష పెంచుకున్న ఓ వ్యక్తి వేటకొడవలితో దాడిచేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ సమీపంలోని రాజేంద్రనగర్‌లో లావణ్య అనే మహిళపై ఆమె మాజీ భర్త సాయికిరణ్‌ వేటకొడవలితో దాడి చేయబోయాడు. 

మాజీభర్త సాయికిరణ్ చంపేస్తానని పలుమార్లు లావణ్యను హెచ్చరించాడు. దాంతో లావణ్య ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అయితే శనివారం సాయికిరణ్ దాడి చేయబోతున్నాడని ముందే పసిగట్టింది. 

ఉదయం పదిగంటలకు రాజేంద్రనగర్ లో ఉన్న లావణ్యపై దాడి చేసేందుకు సాయికిరణ్ ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన ఆమె డయల్ 100కు ఫోన్ చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయికిరణన్ ను అదుపులోకి తీసుకున్నారు. 

సాయికిరణ్ షర్ట్ లోపల దాచుకున్న వేటకొడవలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇకపోతే సాయికిరణ్, లావణ్యలు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువురు విడాకులు తీసుకున్నారు. 

తన ఇద్దరు పిల్లలతో లావణ్య బండ్లగూడ జాగీరు కాలనీలో నివాసం ఉంటుంది. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అయితే గతంలో కూడా తన తల్లిపై సాయికిరణ్ హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించాడని ఆ కేసు విచారణలో ఉందన్నారు. తాజాగా తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నించబోయాడని తనను రక్షించాలని లావణ్య పోలీసులను వేడుకుంది.