నిర్మల్: మహారాష్ట్రలో ఓ సాధుపును, ఆశ్రమ వాచ్ మన్ ను హత్య చేసిన కేసులో నిందితుడు తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో పట్టుబడ్డాడు. ఆదివారం తెల్లవారు జామును నిందితుడు సాధువును, ఆశ్రమ వాచ్ మన్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నిందితుడు పారిపోయి నిర్మల్ జిల్లా తానూర్ గ్రామానికి చేరుకున్నాడు. దానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు ఇవ్వడంతో తానూరు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

నాందేడ్ జిల్లా ఉమ్రి తాలూకా నగ్దానా గ్రామంలో శివాచార్య రుద్రప్రతాప్ మహరాజ్ (33) ఓ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత అదే గ్రామానికి చెందిన సాయినాథ్ లింగాడె ఆశ్రమంలోకి చొరబడి మొదట వాచ్ మన్ భగవాన్ షిండే (50)ను హత్య చేశాడు. అతని కనుగుడ్లు పీకేశాడు. ఆ తర్వాత మఠంలోకి వెళ్లి కళ్లలో కారం చల్లి శివాచార్యను హత్య చేశాడు. 

సాధువు మృతదేహాన్ని కారులో వేసుకుని పారిపోయే ప్రయత్నంలో ఆశ్రమ గేటును ఢీకొట్టాడు. స్థానికులు మేల్కొని బయటకు రావడంతో టూవీలర్ పై పారిపోయాడు. తన చిన్నమ్మ ఉండే నిర్మల్ జిల్లా తానూరుకు వచ్చాడు. దాంతో మహారాష్ట్ర పోలీసులు తానూరు ఎస్ఐ గుడిపెల్లి రాజన్నకు సమాచారం ఇచ్చారు. 

నిందితుడి ఫొటోలను వాట్సప్ చేశారు. ఆ ఫోటోలను ఎస్ఐ స్థానికులకు, పరిసర గ్రామస్థులకు పంపించారు. సాయినాథ్ లింగాడె ఆదివారం తానూర్ మండలం ఏల్వి గ్రామం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నట్లు గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. 

పోలీసులు అక్కడికి చేరుకుని సాయినాత్ లింగాడెను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మోటార్ సైకిల్ ను, రూ. 70 వేల నగదును, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. లింగాడే ధర్మాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో పదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో కూడా నిందితుడు.