బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 25యేళ్ల జైలు శిక్ష, జరిమానా..
కొత్తగూడెంలో ఓ వ్యక్తి మూడేళ్ల క్రితం బాలిక మీద అత్యాచారం చేశాడు. ఈ కేసులో నిందితుడికి తాజాగా 25యేళ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం కోర్టు తీర్పునిచ్చింది.
కొత్తగూడెం : బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా జడ్జి సోమవారం తీర్పునిచ్చారు. కొత్తగూడెంకు చెందిన శ్రీనివాస్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు 2019 మే 7న స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనిమీద దర్యాప్తు తర్వాత కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో 13 మంది సాక్షులను విచారించారు. ఆ తర్వాత శ్రీనివాస్ పై ఆరోపించిన నేరం రుజువైందని న్యాయస్థానం భావించింది. దీంతో శ్రీనివాస్ కి సెక్షన్ 42 Pocso act ప్రకారం 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా లేదా జరిమానాకు బదులుగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 56 భారత శిక్షాస్మృతి ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. మూడు వేల జరిమానా లేదా జరిమానా కింద రెండు నెలల కారాగారశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు నిచ్చారు.
ఇదిలా ఉండగా, జూలై 1న ఇలాంటి కేసులో నిందితుడికి త్రిపుర కోర్టు మరణశిక్ష విధించింది. నాలుగున్నరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె ఎవరికైనా చెబుతుందనుకున్నాడో ఏమో హత్య చేశాడు. ఘటన వెలుగులోకి రావడంతో ఈ వ్యక్తిని అరెస్టు చేశారు. త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. జిల్లా కోర్టు, ప్రత్యేక పోక్సో చట్టం న్యాయమూర్తి శంకరి దాస్ ఈ తీర్పు వెలువరించారు.
Siddipet Crime News: సిద్దిపేటలో సినిమా స్టైల్ లో దొంగతనం.. నిమిషాల్లో లక్షలు మాయం.. వీడియో
ఈ కేసు పూర్వాపరాలలోకి వెళితే… అగర్తలలోని ఖోవై జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడ తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్లు బాలిక నిరుడు ఫిబ్రవరిలో ఇంటిముందు ఆడుకుంటుంది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి.. కాసేపటికే కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. అలా తప్పిపోయిన చిన్నారి... ఆరు రోజుల తర్వాత ఒంటినిండా గాయాలతో విగతజీవిగా కనిపించింది.
దీంతో బాధిత బాలిక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు, పోలీస్ స్టేషన్ లో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కాళీ చరణ్ త్రిపురగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని మీద అత్యాచారం, హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం... సహా పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు ఇన్స్పెక్టర్ బిద్యేశ్వర్ సిన్హా తాజాగా నివేదికను, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టుకు సమర్పించారు. విచారణ తర్వాత నిందితుడు దోషిగా నిర్ధారించిన కోర్టు మరణ శిక్ష విధించింది. ఖోవై జిల్లాలో మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి.