కన్న తల్లిని, రక్తం పంచుకు పుట్టిన బిడ్డను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. కాగా.. అతను చేసిన నేరం కోర్టులో నిరూపితం కావడంతో... ప్రస్తుం జైలు జీవితం గడుపుతున్నాడు. అతనికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  మహబూబ్ నగర్ జిల్లాకు  చెందిన సిద్దిగారి నరసింహ(30) కి 2014లో వివాహమయ్యింది. కాగా... అదనపు కట్నం కావాలంటూ.. 2015లో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో జైలుకి వెళ్లిన నరసింహ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. కాగా... అతనికి ఓ కుమార్తె కూడా ఉంది.

బెయిల్ మీద బయటకు వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా తాగి తల్లి, కన్న కూతురిని హింసించేవాడు. తల్లి కూలి పనులు చేసుకొని వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బును బలవంతంగా లాక్కొని వెళ్లి.. వాటితో మద్యం సేవించేవాడు. ఇతర దురలవాట్లు కూడా నరసింహకు ఉన్నాయి. కాగా...  2018 జూన్ 14వ తేదీన మందు తాగడానికి డబ్బు కావాలని తల్లిని అడిగాడు. అవి ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో... తల్లిని, తన నాలుగేళ్ల కుమార్తెను హత్య చేశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరసింహను అరెస్టు చేశారు.

ఇటీవల ఈ కేసు న్యాయస్థానంలో హియరింగ్ కి రాగా... నరసింహ నేరం చేసినట్లు రుజువు అయ్యింది. దీంతో... మహబూబ్ నగర్ న్యాయస్థానం అతనికి రూ.పదివేల జరిమానా, జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.