హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన ఏసీపీ నర్సింహ్మారెడ్డి  రిమాండ్ రిపోర్టులో ఏసీబీ కీలక అంశాలను ప్రస్తావించింది.

ఏసీపీ నర్సింహ్మారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడినట్టుగా ఏసీబీ ఆరోపిస్తోంది. భారీగా ఆస్తులను కూడబెట్టినట్టుగా ఏసీబీ తన రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది.

also read:మల్కాజిగిరి ఏసీబీ నర్సింహ్మారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి  ఆస్తుల కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన నర్సింహ్మారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్టుగా ఏసీబీ గుర్తించింది.ఈ కేసులో ఇప్పటికే 11 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం  ఏసీబీ గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ కేసులో ఏ 2 నుండి ఏ 13 వరకు ఏసీపీకి సహకరించినట్టుగా ఏసీబీ గుర్తించింది. హైద్రాబాద్ హైటెక్ సిటీలోని సర్వే నెంబర్ 64లో రూ. 60 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. సుమారు 2 వేల గజాల భూమిని 490 గజాలుగా విభజించి 4 డాక్యుమెంట్లను సృష్టించారని ఏసీబీ గుర్తించినట్టుగా సమాచారం.

తొలుత తల్లిదండ్రుల పేరుతో గిఫ్ట్ డీడ్ చేసి ఆ తర్వాత బినామీల పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారని ఏసీబీ గుర్తించింది.ఈ 2 వేల గజాల భూమి ప్రభుత్వ భూమి అని ఏసీబీ గుర్తించింది. హైద్రాబాద్ లో 14 నివాసాలు, అనంతపురంలో 55 ఎకరాల భూమి ఉన్నట్టుగా ఏసీబీ తమ దర్యాప్తులో తేల్చింది.