లంచం డిమాండ్.. 20 గంటల విచారణ.. బంజారాహిల్స్ సీఐ, ఎస్‌ఐలకు ఏసీబీ నోటీసులు
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ సీఐ నరేందర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరిలకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు

హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ సీఐ నరేందర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లంచం కోసం డిమాండ్ చేశారని ఓ పబ్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సీఐ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరిలపై పోలీసులు కేసు నమోదుచేశారు. మరోవైపు సీఐ నరేందర్‌పై ఫిర్యాదు చేసిన పబ్ నిర్వాహకుడిని గత రాత్రి పిలిపించిన అధికారులు.. అతడి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు.
ఇక, సీఐ నరేందర్.. పబ్‌లలో వసూళ్లతో ఇంకేమైనా వసూళ్లకు పాల్పడ్డారనే విషయాలను కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. నరేందర్‌పై గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి దాదాపు 20 గంటల పాటు.. సీఐ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరిలను ఏసీబీ అధికారులు విచారించారు. వాట్సాప్ కాల్స్, చాట్స్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే సీఐ నరేందర్, ఎస్సై నవీన్ రెడ్డి, హోంగార్డు శ్రీహరిలకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో వారు ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.