హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెుండి వైఖరి నశించాలని డిమాండ్ చేశారు ఏబీవీపి విద్యార్థి సంఘం నేతలు. ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ  విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 

సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ అలసత్వ, నిరంకుశ, మొండి వైఖరిని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్ అహంకారం వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. 

ఇకనైనా కేసీఆర్ భేషజాలు వీడి సమ్మె నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమ్మెకు ముగింపు పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.  

విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించి విద్యాసంవత్సరానికి విఘాతం కలుగకుండా చూడాలని డిమాండ్ చేశారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే భాద్యత వహించాని డిమాండ్ చేశారు. వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్ష్ గ్రేషియా ప్రకటించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ డిమాండ్ చేశారు.