ABVP Bandh:   తెలంగాణ‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో నెల‌కొన్న‌సమస్యలు ఎత్తిచూప‌డానికి ఏబీవీపీ సిద్ద‌మైంది. ఈ మేర‌కు ఈనెల 5న (మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్నసమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బంద్ చేపడుతుంది.ఈ బంద్ ను  విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. 

ABVP Bandhu: అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) కీలక ప్రకటనను వెలువ‌రిచింది.  తెలంగాణ‌లోని ప్రభుత్వ, ప్రైవేట్  పాఠశాలల్లో సమస్యలను ఎత్తిచూపాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో నిరసనగా నేడు (మంగళవారం) రాష్ట్ర‌వ్యాప్తంగా  పాఠశాలల బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ సందర్భంగా ఏబీవీపీ  రాష్ట్ర‌ నాయకులు  శ్రీశైలం వీరమల్ల మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలు తెరిచి 20 రోజులు కావస్తున్నా.. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదని, చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు, మరుగుదొడ్లు తదితరాలు లేవని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంద్‌లో పాల్గొనాలని కోరారు. అలాగే.. ప్రయివేటు పాఠశాలల్లో సరైన ఫీజుల విధానం అమలు చేసేందుకు ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని ఏబీవీపీ డిమాండ్‌ చేస్తోందని తెలిపారు. తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్న కార్పొరేట్ స్కూళ్లను వెంట‌నే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.  రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ బంద్ ను విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయ‌కులు విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఇంకా గత నెల 2న ఏబీవీపీ నాయ‌కులు..  పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ.. లక్డికాపూల్‌లోని కమీషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ క్ర‌మంలో 9 మంది నేతలను రిమాండ్‌కు తరలించి చంచలుగూడ ​​జైలుకు తరలించారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన 34 మంది విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు.  

విద్యార్థులపై కేసులు పెట్టడంపై ఏబీవీపీ నాయ‌కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంట‌నే..  ఆ విద్యార్థులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని, అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన‌ విద్యార్థులను త‌క్ష‌ణమే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్‌ సురేష్‌ డిమాండ్ చేశారు.