తగ్గించిన పాల ధరలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో పాడి రైతుల సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. ఆలేరు పట్టణంలోని రైల్వే గేటు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వీరికి మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మద్దతు తెలిపడమే కాకుండా రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించాడు. దీంతో ఈ నిరసన కాస్త వేడెక్కింది.  

 రైతుల రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై దాదాపు  రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  దసరా సెలవులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుండి
ప్రయాణికులు ఈ వరంగల్-హైదరాబాద్ రహదారి మీదుగానే ప్రయాణిస్తున్నారు. అయితే ఈ రాస్తారోకో కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  

ఈ నిరసన విరమించమని పోలీసులు ఎంత సముదాయించినా రైతులు మాత్రం రోడ్డుపై నుంచి కదలడం లేదు. మదర్ డైరీ ఛైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి వచ్చిస్పష్టమైన హామీ ఇచ్చేవరకు నిరసన విరమించేది లేదని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు మోత్కుపల్లి నర్సింహులుతో సహా పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆలేరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.