నవ మాసాలు మోసి కన్న తల్లిని, అల్లారుముద్దుగా పెంచిన తండ్రిని ఓ కసాయి కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేశాడు. కేవలం మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేరన్న కారణంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ మంటల్లో చిక్కుకున్న తల్లి 80 శాతం కాలిపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. తండ్రికి స్వల్ప గాయాలతో బైటపడ్డాడు.ఈ ఘటన హైదరాబాద్ లోని మలక్ పేట పరిధిలో చోటుచేసుకుంది.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మూసారాంబాగ్ తులసీనగర్ కు చెందిన మంగమ్మ దివ్యాంగుడైన భర్తతో కలిసి నివాసముంటోంది. ఈమెకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు కాగా నలుగురికి వివాహాలై వేరే చోట ఉంటున్నారు. చిన్న కొడుకు రాజేష్ కు పెళ్లి కాకపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు.

జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలిగా పనిచేస్తూ మంగమ్మ కుటుంబాన్ని పోషిస్తోంది. రాజేష్ పనీ పాట లేకుండా తిరుగుతూ తల్లి దగ్గర డబ్బులు తీసుకుని జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి మద్యం తీసుకునేందుకు తల్లికి డబ్బులు అడిగాడు. మంగమ్మ అతడికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో తల్లిదండ్రులను ఇంట్లో పెట్టి తాళం వేసి రాజేష్ బైటికి వెళ్లాడు.

స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం తాగి ఓ బాటిల్ లో పెట్రోల్ కొనున్నుని ఇంటికి వచ్చాడు. తాళం వేసిన ఇంటి తలుపుల కింది నుండి పెట్రోల్ ఇంట్లోకి పోసి నిప్పంటించాడు. దీంతో నేలపైనే పడుకున్న మంగమ్మ కు మంటలు అంటుకున్నాయి. కాస్త దూరంగా పడుకున్న తండ్రికి స్పల్ప గాయాలయ్యాయి. అయితే తల్లి మంటల్లో కాలిపోతుండటంతో భయపడిపోయిన రాజేష్ మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో అతడికి కూడా గాయాలయ్యాయి.

మంటల్లో మంగమ్మ శరీరం 80 శాతం కాలిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతునన్నారు. ఈ దారుణానికి పాల్పడిన రాజేష్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.