మరికొన్ని రోజుల్లో తెలంగాణలో ఒక మినీ ఎన్నికల సంగ్రామం  విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికలతోపాటుగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటికే మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్ వీటి మీద ఫుల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. 

ఈ ఎన్నికల తరువాత కేటీఆర్ కి పట్టాభిషేకం కూడా జరగబోతుందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం ఈ ఎన్నికల్లో తెరాస బ్రహ్మాండమైన విజయం సాధించేందుకు కేటీఆర్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. 

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్(ఉమ్మడి జిల్లాల) పట్టభద్రుల స్థానాన్ని ఎలాగైనా బీజేపీ నుండి హస్తగతం చేసుకోవాలని తెరాస చూస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పావులు కదుపుతోంది. కాంగ్రెస్ అంత బలంగా లేదు కాబట్టి బీజేపీని కౌంటర్ చేయడానికి అన్ని శస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. 

ఈ తరుణంలో కేటీఆర్ కి షాక్ ఇస్తూ... మాజీ ఎమ్మెల్సీ, ఇదే పట్టభద్రుల స్థానం నుండి గతంలో ఎమ్మెల్సీ గా గెలుపొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టుగా అధికారికంగా ఇప్పుడే ప్రకటించారు. 

ప్రొఫెసర్ నాగేశ్వర్ కి చదువుకున్న వారిలో మంచి పేరుంది. ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలడని రాష్ట్రంలోని వోకల్ సెక్షన్స్ అయిన విద్యావంతులకు తెలుసు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో వారికి ప్రభుత్వానికి మధ్య  కుదర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేసారు. 

ఆయనకు ఉద్యోగ సంఘాల్లో కూడా మంచి పేరుంది. ముక్కుసూటి మనిషిగా, ప్రొఫెసర్ గా, ఉన్నత విద్యావంతుడిగా, సమస్యలపై పోరాడేవాడిగా, సామాన్యుడి వాయిస్ వినిపించేవాడిగా ప్రజలు భావిస్తుంటారు. 

ఇప్పుడు ఎన్నికల బరిలో నాగేశ్వర్ గనుక నిలబడితే ఆ స్థానాన్ని దక్కించుకోవడం తెరాస కు అంత సులువైన పనిమాత్రం కాదు. ఇప్పటికే నిరుద్యోగ యువతలో తెరాస ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బీజేపీ కాకుండా నాగేశ్వర్ గనుక బరిలో నిలబడితే ఇక పోరు రసవత్తరం అవడం తథ్యం. కేటీఆర్ లక్ష్యాలకు ఇది ఇప్పుడు అత్యంత పెను సవాల్ గా మారనుంది.