నాగర్ కర్నూల్: అదనపు కట్నం కోసం భర్త చిత్రహింసలకు గురిచేసినా భరించిన భార్య అతడు దూరం పెట్టడంతో తట్టుకోలేకపోయింది. పుట్టింటి నుండి అత్తవారింటికి తీసుకెళ్లడానికి భర్త నిరాకరించడంతో తట్టుకోలేకపోయిన ఓ మహిళ దారుణ నిర్ణయం తీసుకుంది. తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే...  నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన అమృతమ్మకు 16వ ఏటే తిమ్మాజిపేట మండలం పుల్లగిరి గ్రామానికి చెందిన భానూరు రాజుతో వివాహమైంది. అయితే తెలిసీ తెలియని వయసులో అత్తవారింట్లో అడుగుపెట్టిన అమృతమ్మ నిత్యం భర్త అవమానాలను, అదనపు కట్నం కోసం వేధింపులకు గురయ్యేది. అయినా అవన్నీ సహనంతో భరిస్తూ భర్తతో కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలలకు జన్మనిచ్చింది. 

అయితే రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన అమృతమ్మను తిరిగి అత్తింటికి తీసుకెళ్లేందుకు భర్త అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనోవేధనకు గురయిన అమృతమ్మ గ్రామ సమీపంలోని చెరువులో మొదట తన ఇద్దరు చిన్నారులను తోసి ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.