ఒక భార్య తన ప్రియుడితో కలిసి కుట్ర చేసి భర్తను హత్య చేయించింది. చాలా జాగ్రత్తగా ఎలాంటి ఆధారాలు దొరకకుండా చూసుకుంది. హత్య సమయంలో ఫోన్లు మాట్లాడితే పోలీసులకు చిక్కుతామని ఫోన్లు కూడా ఆఫ్ చేసింది. అయినా పోలీసులు హత్య కేసును చేధించారు. భార్యతోపాటు, ఆమె ప్రియుడిని, హత్యకు సహకరించిన మరో ఇద్దరిని కటకటాల వెనకకు నెట్టారు. ఇంతకూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ భర్య, ప్రియుడు ఎలా దొరికారో తెలిస్తే షాక్ తినక మానరు.
నర్సింహా, చిట్టెమ్మ ఇద్దరు భార్యాభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహింపట్నం మండలంలోని మీర్‌పేట మంద మల్లమ్మ గార్డెన్స్ సమీపంలో నివాసం ఉండేవాడు. చిట్టెమ్మ ఇటీవలకాలంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలం తర్వాత తన అక్రమ బాగోతానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను చంపేందుకు కుట్ర పన్నింది.
ప్రియుడితో కలిసి పథకరచన చేశారు. మరో ఇద్దరు వ్యక్తులతో బేరం కుదుర్చుకున్నారు. రంగంలోకి దిగిన ఆ ఇద్దరు కిరాయి వ్యక్తులు నర్సింహ్మా మందు తాగే షాప్ వద్దకు తరచుగా వెళుతూ ఆయనతో స్నేహం పెంచుకున్నారు. జూన్ 6వ తేదీ రాత్రి నర్సింహకు మద్యం తాగించి ద్విచక్రవాహనంపై బొంగళూరు గేట్ సమీపంలోని బాహ్యవలయ రహదారి సర్వీస్ రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. అక్కడే గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని కాల్చేశారు.
మరుసటి రోజు మృతదేహాన్ని గుర్తించిన ఆధిభట్ల పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిలో నమోదైన ఫోన్‌కాల్స్ గురించి ఆరా తీసిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ ఘటన పోలీసులకు సవాల్ గా మారింది.
పకడ్బందీగా భర్తను మట్టు పెట్టించిన చిట్టెమ్మ రెండో రోజుల తర్వాత ఏమీ ఎరుగనట్లే సరూర్‌నగర్ పిఎస్ లో భర్త అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే మృతదేహం చిత్రాలను ఆధిభట్ల పోలీసులు అన్ని స్టేషన్లకు పంపించారు. చిట్టెమ్మ సరూర్ నగర్ పిఎస్ కు వెళ్లిన సమయంలో అక్కడి నోటీస్ బోర్డుపై కాలిపోయిన నర్సింహ మృతదేహం చిత్రాన్ని పోలీసులు అతికించారు. కానీ భర్త మృతదేహం చిత్రాన్ని చూసినా చిట్టెమ్మ చూడనట్లు నటిస్తూ వెళ్లిపోయింది.
అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఠాణా నోటీస్ బోర్డులో అతికించిన నర్సింహ మృతదేహం చిత్రాన్ని అతడి బంధువు ఒకరు కొద్దిగా గుర్తించారు. కాలిపోయిన డెడ్ బాడీ ఫొటో కావడంతో ఆయన పోల్చుకోలేకపోయాడు. అయితే ఆయనకు అనుమానం మాత్రం బలంగా ఉంది. దీంతో ఆధిభట్ల ఠాణాను ఆశ్రయించాలని అక్కడి పోలీసులు సూచించారు. ఠాణాకు వచ్చిన తర్వాత కూడా నర్సింహ బంధువుకు మృతదేహం చిత్రంపై స్పష్టత లేకపోయింది.
ఈ ఘటనను ఎలా చేధించాలనుకుంటున్న సమయంలో పోలీసులకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. సంఘటనాస్థలిలో తమకు దొరికిన బీడీకట్టను నర్సింహ్మ బందువుకు చూపించారు. ఆ బీడీ కట్ట, నర్సింహ్మ తాగే బీడీ కట్ట ఒకటేనని సదరు బంధువు బల్లగుద్ది మరీ చెప్పాడు. దీంతో దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు కేసును చేధించారు.
భర్త అదృశ్యంపై సరూర్‌నగర్ పిఎస్ లో చిట్టెమ్మ ఫిర్యాదు చేసే నాటికే నోటీస్ బోర్డులో నర్సింహ మృతదేహం చిత్రాన్ని చూసినా ఆమె నోరు మెదపకపోవడంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ఆమె గురించి ఆరా తీసిన తర్వాత వివాహేతర సంబంధం గురించి బహిర్గతమైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తే నేరం అంగీకరించింది. దీంతో చిట్టెమ్మను, ఆమె ప్రియుడిని, మరో ఇద్దరు కిరాయి హంతకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఫోన్ మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకున్నా, శవాన్ని గుర్తించకుండా పెట్రోలు చల్లి కాల్చివేసినా చివరికి నర్సింహ్మ తాగే బీడికట్ట ఆయన ఆచూకీని తెలిపేలా చేసి నిందితులను పట్టించాయి.
