తెలంగాణలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. కొత్తగా 865 మందికి పాజిటివ్
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 865 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రకటించింది. కరోనా నుంచి నిన్న 2,484 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 19,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 263 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసులు (corona cases in telangana) తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 61,573 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 865 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బారినపడిన వారి సంఖ్య 7,80,836కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో (corona deaths in telangana) వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,103కి చేరింది. కరోనా నుంచి నిన్న 2,484 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 19,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 263 కేసులు నమోదయ్యాయి.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 8, భద్రాద్రి కొత్తగూడెం 25, జీహెచ్ఎంసీ 263, జగిత్యాల 23, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 3, కామారెడ్డి 9, కరీంనగర్ 28, ఖమ్మం 35, మహబూబ్‌నగర్ 19 ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 16, మంచిర్యాల 19, మెదక్ 9, మేడ్చల్ మల్కాజిగిరి 67, ములుగు 3, నాగర్ కర్నూల్ 11, నల్గగొండ 33, నారాయణపేట 3, నిర్మల్ 13, నిజామాబాద్ 19, పెద్దపల్లి 28, సిరిసిల్ల 13, రంగారెడ్డి 60, సిద్దిపేట 25, సంగారెడ్డి 27, సూర్యాపేట 22, వికారాబాద్ 8, వనపర్తి 5, వరంగల్ రూరల్ 8, హనుమకొండ 35, యాదాద్రి భువనగిరిలో 13చొప్పున కేసులు నమోదయ్యాయి.
కాగా.. గత 24 గంటల్లో దేశంలో కొత్త నమోదైన కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. అంతకు ముందు రోజు 67,597 కేసులు నమోదుకాగా, తాజాగా 71,365 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. నిన్నటితో పోలిస్తే.. కొత్త కేసుల్లో 5 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. దీంతో దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 4,24,10,976 కు పెరిగింది. ఇదే సమయంలో 1,72,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 4,10,12,869 కి పెరిగింది. ప్రస్తుతం 8,92,828 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే.. మరణాలు సైతం స్వల్పంగా పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,05,279 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 96.5 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కరోనా పాజిటివిటీ రేటు 8.2 శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ లు టాప్ లో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు మొత్తం 78,16,243 మంది కరోనా బారినపడ్డారు. అలాగే, 1,43,155 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
కరోనా (Coronavirus) నియంత్రణ కోసం కోవిడ్-19 పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా నిర్వహిస్తోంది అధికార యంత్రాంగం. ఇప్పటివరకు దేశంలో మొత్తం 170.9 కోట్ల కోవిడ్-19 టీకాలను పంపిణీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మొదటి డోసుల సంఖ్య 90.2 కోట్లు ఉండగా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 73.2 కోట్ల మంది ఉన్నారు. అలాగే, ఇప్పటివరకు మొత్తం74,29,08,121 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 13,46,534 కోవిడ్-19 (Coronavirus) శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.