హైద్రాబాద్‌లో దారుణం: అమావాస్య నాడు ఎనిమిదేళ్ల బాలుడి నరబలి
హైద్రాబాద్ లో ఎనిమిదేళ్ల బాలుడి మృతి ఉద్రిక్తతకు కారణమైంది. అమావాస్య రోజున ఈ బాలుడిని నరబలి ఇచ్చారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని సనత్ నగర్ లో ఎనిమిదేళ్ల బాలుడి హత్య కలకలం రేపుతుంది. ఈ నెల 20వ తేదీ నుండి కన్పించకుండా పోయిన అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం ఇంటికి సమీపంలోని నాలాలో గుర్తించారు కుటుంబ సభ్యులు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ హత్య చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హిజ్రా ఇంటిపై మృతుడి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. ట్రాన్స్ జెండర్ ఇంటిలో క్షుద్రపూజలు నిర్వహించిన ఆనవాళ్లను గుర్తించారు.
నిన్న అమావాస్య రోజున ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను హిజ్రా నరబలి ఇచ్చినట్టుగా మృతుడి బంధువుల ఆరోపిస్తున్నారు. నీళ్ల బకెట్ లో ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను ముంచి హత్య చేశారు. మృతదేహన్ని సమీపంలోని నాలాలో వేశారు. మృతదేహన్ని నాలాలో వేసేందుకు డబ్బాలో తీసుకెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీలో గుర్తించారు.
వహీద్ ను నరబలి ఇచ్చారా , లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను హత్య చేసిన ట్రాన్స్ జెండర్ ను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం మృతి చెందిన బాలుడి కుటంబానికి ట్రాన్స్ జెండర్ ఇమ్రాన్ మధ్య ఘర్షన చోటు చేసుకుంది. డబ్బుల విషయమై వివాదం జరిగిందని చెబుతున్నారు. ఈ సమయంలోనే బాలుడిని చంపుతానని ఇమ్రాన్ వార్నింగ్ ఇచ్చారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.