ప్రజావాణికి ఒక్కరోజే 8వేలమంది..ప్రజాభవన్ నుంచి పంజాగుట్టవరకు క్యూ లైన్..
ప్రజా భవన్ అధికారులు మొదట వికలాంగులు, మహిళలకు తొలి ప్రాధాన్యతని ఇచ్చి వారి నుంచి వినతి పత్రాలను సేకరించారు.
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి జనం ప్రజాభవన్ కి బారులు తీరుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఇలా ఏకంగా 8000 మంది జనం వచ్చారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్, భద్రాచలంలాంటి దూర ప్రాంతాల నుంచి కూడా విజ్ఞాపన పత్రాలను పట్టుకుని వచ్చినవారితో ప్రజాభవన్ నుంచి.. పంజాగుట్ట వరకు క్యూ లైన్ నిండిపోయింది.
రాత్రంతా ప్రయాణం చేసి తెల్లవారేసరికి ప్రజాభవన్ కు వస్తున్నారు కొంతమంది. ధరణిలో పేరు లేదని, పాస్ బుక్ లు లేవని, పింఛన్, రేషన్ కార్డ్, ఉద్యోగావకాశాలు, భూమికబ్జాలు లాంటి అనేక సమస్యలతో ప్రజలు వస్తున్నారు. పెద్ద స్థాయిలో జనం ప్రజాభవన్ కి పోటెత్తడం… క్యూలైన్లు పెరిగిపోవడంతో ఉదయం పూట ట్రాఫిక్ భారీగా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజా భవన్ అధికారులు మొదట వికలాంగులు, మహిళలకు తొలి ప్రాధాన్యతని ఇచ్చి వారి నుంచి వినతి పత్రాలను సేకరించారు.
Telangana Congress: 2024 లోక్ సభ టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు.. ఆ ముగ్గురు పార్లమెంటు బరిలో?
శుక్రవారం నాడు ప్రజావాణి నిర్వహణను వాటర్ బోర్డు ఎండి దాన కిషోర్, ఆయుష్ డైరెక్టర్ హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమన్వయం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూకబ్జాదారుడు ఆగడాలు సృష్టించారని.. వాటిని అరికట్టాలని.. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని సిపిఐ నాయకులు ప్రజా దర్బార్ లో వినతి పత్రం అందజేశారు. టిఆర్ఎస్ నాయకులు ఇప్పటికి కబ్జాలకు పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో వీటి మీద చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. మరోవైపు విశ్వకర్మ కాలనీ, జగద్గిరిగుట్టలోని పలుడివిజన్లు, గాజులరామారంలోని కొన్ని సర్వే నెంబర్లు, భూదేవి హిల్స్, పరికిచెరువు, దేవాదాయ భూమి, మహాదేవపురం గుట్టలపై అక్రమ నిర్మాణాలను అరికట్టాలని కొంతమంది కోరారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదంటూ ఈఎస్ఐ కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు కొంతమంది వచ్చారు. తమలాగా జీతాలకు ఇబ్బందిపడుతున్నవారు 120మందివరకు ఉన్నారని తెలిపారు.