ఎస్బీఐ బ్యాంకులో జరిగిన చోరీలో ఓ యేడో తరగతి విద్యార్థి నిందితుడిగా కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ బాలుడు గునపంతో బ్యాంకు తాళాలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించాడు. 

మహబూబాబాద్ : తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఎస్బిఐ బ్రాంచ్ లో చోరీ జరిగింది. ఈ చోరీ విషయం తెలిసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా.. అందులో ఏడో తరగతి విద్యార్థి కనిపించడం ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం రాత్రి 8.20గంటలకు ఆ బాలుడు బ్యాంకు దగ్గరికి రావడం.. చోరీ చేయడం కనిపించింది. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతం…రోడ్డు పక్కనే ఉండే బ్యాంకు ఆవరణలోకి బాలుడు ఒక్కడే ధైర్యంగా రావడం చూస్తుంటే ఎవరో డైరెక్షన్ ఇస్తే ఇలా చేశాడా? లేక తనంతట తనే చేశాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

బయ్యారం- పందిపంపుల రహదారి పక్కనే ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ ఆవరణలోకి బుధవారం రాత్రి ఇర్సులాపురానికి చెందిన 13 ఏళ్ల పిల్లాడు గడ్డపారతో వచ్చాడు. బాలుడి కుటుంబం బయ్యారంలోనే ఉంటోంది. బ్యాంకు వెనుక వైపు ఉన్న గ్రిల్స్ తలుపు తాళం పగలగొట్టి… లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత లోపల బ్యాంకులో ఉన్న అన్ని డిస్కులను చిందర వందర చేశాడు. డబ్బులు, నగలు ఏమైనా దొరుకుతాయేమోని గంటపాటు వెతికాడు.

చారిత్రాత్మకం.. తొలిసారిగా తెలుగులో తీర్పు వెలువరించిన తెలంగాణ హైకోర్టు.. ఏ కేసులో అంటే ?

ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయినట్లుగా సీసీటీవీ కెమెరాలో నమోదయింది. ఈ విషయం గురువారం ఉదయం కానీ వెలుగులోకి రాలేదు. గురువారం పొద్దున ఊడవడానికి స్వీపర్ పద్మ బ్యాంకు దగ్గరికి వచ్చింది. అప్పటికే బ్యాంకు తాళం పగలగొట్టి ఉండడం గమనించిన ఆమె.. వెంటనే విషయాన్ని అధికారులకు తెలిపింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

బ్యాంకు చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని… అలాంటి బ్యాంకులోకి ఓ 13 ఏళ్ల పిల్లాడు రావడం సాధ్యమయ్యే విషయమేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడ్డపారతో తాళం పగలగొట్టడం.. ఆశబ్దాలు బయటికి రాకపోవడం..అంత సులభంగా తాళం ఎలా పగలగొట్టగలిగాడు… ఆ బాలుడితో సాధ్యమయ్యే విషయమేనా.. ఇంకెవరైనా బయటి నుంచి డైరెక్షన్స్ ఇచ్చి చేయించారా? అని పోలీసులతోపాటు.. బ్యాంకు అధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఓ పాత నేరస్తుడు బెదిరించడం వల్లే తానీ పని చేసినట్లుగా ఒప్పుకున్నాడని సమాచారం. బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన బాలుడికి ఇటీవల దొంగతనాల్లో అనుభవం ఉన్న పాత నేరస్థుడు పరిచయం అయ్యాడు. అతను బాలుడిని మచ్చిక చేసుకుని బ్యాంకులో దొంగతనం చేయాలని బెదిరించినట్లుగా తెలుస్తోంది. వెనకనుంచి తనను బ్యాంకు గోడమీదికి ఎక్కించి..తను బైటికి వచ్చేవరకు అతను అక్కడే ఉన్నాడని, ఆ తర్వాతే ఇద్దరం ఎవరిళ్లకు వారు వెళ్లినట్లుగాబాలుడు పోలీసులకు తెలిపాడు.

ఈ ఘటనను గార్ల- బయ్యారం సిఐ బాలాజీ, ఎస్ఐ రమాదేవి సీరియస్గా తీసుకొని బ్యాంకు పరిసరాలతో పాటు బ్యాంకులో రికార్డయిన సిసిటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. చోరీకి ప్రయత్నించిన బాలుడి ఆనవాళ్లను గుర్తించారు. ఇర్సులాపురంలో బాలుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తీసుకువచ్చారు. ఆ తర్వాత విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.