Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ కు జానా పొగ

  • అన్ని పదవులు చేసినా తీరని జానా వెలితి
  • 71  వయసులో పిసిసి చీఫ్ పదవి కోసం జానా పావులు
  • ఉత్తమ్ ను దింపేందుకు కొందరు నేతల మద్దతు
  • జానాతోపాటు చాప కింద నీరులా మరికొందరి యత్నాలు
71 year old jana lobbying for pcc chief post

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిఎల్పీ నేత జానారెడ్డి పొగ పెడుతున్నారా? ఎలాగైనా పిసిసి నుంచి ఉత్తమ్ ను దింపి తాను కుర్చీలో కూర్చునేందుకు ఉబలాటపడుతున్నారా? పిసిసి చీఫ్ పదవి కోసం జానారెడ్డి అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారా? రాష్ట్రంలో పార్టీ నేతల మద్దతు కూడగడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

తెలంగాణ రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో జానారెడ్డి  సీనియర్ నేతగా ఉన్నారు. మాజీ సిఎం రోశయ్యతో సమానమైన అనుభవం గడించారు జానా. తెలుగు రాజకీయ నేతల్లో అత్యంత ఎక్కువ కాలం కేబినెట్ మినిస్టర్ గా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు జానారెడ్డి. ప్రస్తుతం ఆయన వయస్సు 71 ఏళ్లు. ఇంత ఘన చరిత ఉన్న జానారెడ్డికి ఒక విషయంలో మాత్రం ఇంకా వెలితి ఉన్నది. అదేమంటే పిసిసి చీఫ్ గా ఇప్పటి వరకు పనిచేయలేకపోవడం. ఆ వెలితిని కూడా తీర్చుకునేందుకు జానారెడ్డి పావులు కదుపుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అధిష్టానం వద్ద జానారెడ్డి చాపకింద నీరులా పావులు కదుపుతూ పిసిసి పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.

జానారెడ్డి ఒక్కసారైనా పిసిసి చీఫ్ గా పనిచేయాలన్న ఆలోచన కలిగిందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం, కేడర్ బలం ఉన్న నాయకులందరి మద్దతును కూడగట్టే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కొంతమంది నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో జానారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉంటే పార్టీ ఓడిపోయే అవకాశం లేదని ఇటీవల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి అత్యంత అనుభవం సొంతం చేసుకున్న జానారెడ్డిని 2019 ఎన్నికల వేళ పిసిసి చీఫ్ పదవి ఇస్తే అందరినీ సమన్వయం చేసుకుని వెళ్తారని జీవన్ రెడ్డితోపాటు మరికొందరు అంటున్నారు.

జానాకు పిసిసి పదవి విషయంలో ఇప్పటికే చిన్నారెడ్డి, డి.కె.అరుణ లాంటి నేతలు కూడా ఆమోదించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా పిసిస రేసులో ఉన్నారు. ఒకవేళ వారికి రాకపోతే ఉత్తమ్ ను దింపి జానాకు ఇప్పించేందుకు వాళ్లు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇక మరో సీనియర్ నేతగా ఉన్న జైపాల్ రెడ్డి మాత్రం జానాకు పిసిసి చీఫ్ పదవి విషయంలో ప్రతికూలంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సందుట్లో సడేమియా అన్నట్లుగా ఒకవైపు జానాకు మద్దతు అంటూనే చాలా మంది నేతలు తమకు పిసిసి పదవి కావాలంటూ అధిష్టానం వద్ద గట్టిగానే పైరవీలు చేసుకుంటున్నారు. ఆ లిస్టు చాలా పెద్దదే ఉన్నట్లు తెలుస్తోంది. రేస్ లో ఉన్నవారిలో బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, డి.కె.అరుణ, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లు కూడా ఉన్నారట.

మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి కుర్చీలోంచి దింపేందుకు తెర వెనుక చాలా మంది నేతలే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios