తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం కొత్తగా 62 మందికి పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,761కు చేరింది. ఇవాళ ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 48కి చేరింది. శుక్రవారం ఏడుగురు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో 1,043 మంది కోలుకున్నట్లయ్యింది.

తెలంగాణలో ప్రస్తుతం 670 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 42, రంగారెడ్డి జిల్లాలో ఒకరికి, మరో 19 మంది వలస కూలీలకు పాజిటివ్‌గా తేలిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

Also Read:వలస కార్మికులకు ఫంక్షన్ హాల్స్‌లో బస : ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశం

కాగా వలస కూలీల కోసం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.వలస కార్మికుల సమస్యలపై తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ వసుధ నాగరాజు  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

వలస కార్మికులను ఆదిలాబాద్ సరిహద్దు దాటించి  వదిలేస్తున్నారని పిటిషనర్ చెప్పారు. మేడ్చల్ రహదారిపై వందలాది మంది కూలీలు రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్నారని ఆయన హైకోర్టు  దృష్టికి తీసుకొచ్చారు.

Also Read;విద్యార్ధుల మధ్య ఆరడుగుల దూరం: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో తెలంగాణ సర్కార్ జాగ్రత్తలు

వలస కూలీలను సరిహద్దులు దాటించి చేతులు దులుపుకోవద్దని  హైకోర్టు సూచించింది. వలస కూలీలను ఆదుకొనేందుకు ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి ఈ నెల 29వ  తేదీ లోపుగా చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వలస కూలీలను  గుర్తించి ఫంక్షన్లలో ఉంచి వారికి భోజన వసతి కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. కార్మికులు రైళ్లు ఎక్కే వరకు ప్రభుత్వమే భోజనం పెట్టాలని కోరింది.  వలస కార్మికులకు అవసరమయ్యే వైద్య సేవలను కూడ కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.