60యేళ్ల వయసులో భర్త అనుమానిస్తూ.. నిత్యం కొడుతుండడంతో తట్టుకోలేని ఆ మహిళ సుపారీ ఇచ్చి హత్య చేయించింది.
సిరిసిల్ల : తెలంగాణలోని సిరిసిల్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త రోజు కొడుతున్నాడని ఓ భార్య సుపారీ ఇచ్చి అతడిని హత్య చేయించింది. అయితే, వీరిద్దరి వయసు 60 ఏళ్ళు దాటడం గమనించాల్సిన విషయం. వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఇలాంటి హత్యలు జరగడం తెలిసిన విషయమే. కానీ.. వయసు మీద పడుతున్నా.. భార్యను అనుమానిస్తూ, నిత్యం కొడుతుండడంతో ఆ ఇల్లాలు విసిగిపోయింది.
ఎలాగైనా భర్తను చంపితే కానీ తన బాధలు తీరవు అని అనుకుంది. దీనికోసం ఓ వ్యక్తికి రెండు లక్షల రూపాయలు సుపారీ ఇచ్చింది. దీంతో ఆమె భర్తను గత నెల 13వ తేదీన హతమార్చారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా బుధవారం నాడు వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కనకవ్వ (60), కాశయ్య (65) దంపతులు. వీరిద్దరూ సిద్దిపేట జిల్లా చింతమడక నుంచి 25 ఏళ్ల క్రితం సిరిసిల్లకు బతుకుతెరువు కోసం వచ్చారు.
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు..
వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కొడుకు మానసిక స్థితి సరిగా లేదు. సిరిసిల్ల మార్కెట్లో ఈ దంపతులిద్దరూ కూరగాయలు అమ్మేవారు. ఈ క్రమంలోనే ఆ భర్త.. భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. అనుమానంతోనే కనకవ్వను తీవ్రంగా కొట్టేవాడు. దీంతో ఆ వేధింపులు ఆమె తట్టుకోలేకపోయింది. తమ్ముడు వరస అయ్యే ఓ వ్యక్తికి ఈ విషయం చెప్పింది.
భర్తను చంపితే రెండు లక్షలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకుంది. కాశయ్యకు మద్యం తాగే అలవాటు ఉంది. గత నెల 13వ తేదీన మద్యం సేవించి అతడు నిద్రిస్తుంటే.. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం సుపారీ ఇచ్చిన వ్యక్తులకు ఫోన్ చేసింది. వారి ఇంటికి వచ్చి పడుకున్న కాశయ్య గొంతుకు దుప్పటి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
ఆ తర్వాత కాశయ్య మృతదేహాన్ని కారులో తీసుకొని వెళ్లి సిరిసిల్లలోని మానేరు వాగు చెక్ డ్యాం దగ్గర ఉన్న స్మశానంలో పూడ్చిపెట్టారు. 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోయారు. ఇదంతా గప్ చుప్ గా జరిగిపోయిందనుకునే లోపు.. ఈ విషయం బయటకి పొక్కింది. దీనికి కారణం హత్యకు ఒప్పందం చేసుకున్న నిందితుల్లో ఒకరు ఈ మొత్తాన్ని వీడియో తీశారు.
అనుకున్న ప్రకారం హత్య చేసిన తర్వాత.. మరో లక్ష రూపాయలు ఇవ్వాలంటూ కనకవ్వను డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే హత్య సమయంలో తీసిన వీడియోలు బయటపెడతామని బెదిరించారు. అలా ఇదంతా బయటకి పొక్కింది. సిరిసిల్ల టౌన్ సీఐ ఉపేందర్ ఈ ఘటన మీద విచారణ చేపట్టారు.
నిందితుల కోసం కూరగాయల మార్కెట్ ఏరియాలో నిఘా పెట్టారు. అనుమానితుల నుంచి సమాచారం సేకరించారు. ఈ విచారణలో భాగంగా వృద్ధుడిని హత్య చేయడానికి సిపారి తీసుకున్న ఇద్దరు నిందితులతో పాటు వృద్ధుడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా వెలుగులోకి వచ్చింది. తాసిల్దారు సమక్షంలో బొందల గడ్డలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకి తీశారు. దీనికి సంబంధించిన వివరాల కోసం పోలీసులను వివరణ కోరగా… వివరాలు ఉన్నతాధికారుల సమక్షంలో తెలుపుతామన్నారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.
