హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదర్‌గూడ జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని పార్క్‌లో బిశాన్ అనే ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటున్నాడు. అయితే అతను నిల్చొన్న సిమెంట్ బల్ల అప్పటికే విరిగిపోయింది.

ఇది తెలియని బాలుడు.. దానిపై కూర్చొని ముందుకు వెనకకూ ఊగుతుండగా ఉన్నట్లుండి ఆ సిమెంట్ బల్ల చిన్నారిపై పడింది. దీంతో బాలుడి తలకు బలమైన గాయమైంది. చుట్టుపక్కల వారు వెంటనే సిమెంట్ బల్లను పక్కకు లాగినప్పటికీ చిన్నారి అప్పటికే మరణించాడు.

అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మరణించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.