కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన 52 మంది నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన 52 మంది నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరందరినీ పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంతకుముందు వీరందరికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

మరోవైపు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో (secunderabad railway station) అల్లర్లకు 15వ తేదీనే ఆందోళన కారులు స్కెచ్ వేసినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. జూన్ 15వ తేదీన కేంద్రం అగ్నిపథ్ ప్రకటనతో ఆందోళన చెందిన అభ్యర్ధులు .. నిరసనలకు ప్రణాళికలు రూపొందించారు. ముందుగా ఏఆర్వో కార్యాలయానికి వెళ్లాలనేది ఆందోళనకారుల ప్లాన్. ఆ తర్వాత రూట్ మార్చి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి వ్యూహరచన చేశారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్‌తో పాటు ఇతర పేర్లతో వాట్సాప్‌లో గ్రూపులు క్రియేట్ చేసుకున్న యువకులు.. 15వ తేదీ నాటికి అందరూ సికింద్రాబాద్‌కు రావాలని నిర్ణయించుకున్నారు. 

Also Read:జూన్ 15నే విధ్వంసానికి స్కెచ్.. తొలుత ఏఆర్వో ఆఫీస్ టార్గెట్, రూట్ మార్చి సికింద్రాబాద్‌ స్టేషన్‌కి

అలాగే ప్రతి ఒక్కరూ పెట్రోల్ బాటిల్ తెచ్చుకోవాలని , స్టేషన్‌ను ఎక్కడికక్కడ బ్లాక్ చేద్దామంటూ వాయిస్ ఛాట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఇందులో ఇప్పటికే అరెస్ట్ అయిన సాయి డిఫెన్స్ అకాడమీ (sai defence academy) డైరెక్టర్ సుబ్బారావు (avula subbarao) ప్రస్తావన కూడా ఆడియోల్లో స్పష్టంగా వుంది. పులి తెలంగాణలో అడుగుపెడుతోంది.. ఇక చూస్కోండి అంటూ వాయిస్ మెసేజ్ పెట్టారు యువకులు. ఆదిలాబాద్ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు రెండు బోగీల్లో యువకులు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోగా.. అటు గుంటూరు, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వారు కూడా రైళ్లోనే నగరానికి చేరుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న వారంతా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసేవారే. 

ఇకపోతే.. సికింద్రాబాద్ స్టేషన్ ఘటనపై రైల్వే పోలీసులు నిన్న ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు స్టేషన్‌లోకి దాదాపు 300 మంది ఆందోళనకారులు ప్రవేశించినట్లు తెలిపారు. సాధారణ ప్యాసింజర్ల మాదిరిగా గేట్ నెం.3 నుంచి ఆందోళనకారులు వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్‌లోకి వచ్చీ రాగానే అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని... కర్రలు, రాడ్లతో ఆ వెంటనే 2 వేల మంది ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. రైళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారని.. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు తెలిపారు. 

రైల్వే ట్రాక్‌పై వున్న రాళ్లతో పోలీసులపై నిరసనకారులు దాడులు చేశారని.. మొత్తం 8 రైళ్లపై దాడులకు తెగబడ్డారని వెల్లడించారు. పోలీసు బలగాలు రాగానే ట్రాక్‌పైకి ఆందోళనకారులు పరుగులు తీశారని.. ఆ వెంటనే భద్రతా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారని వారు తెలిపారు. రాళ్ల దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతి చెందాడని.. మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు.