4వ సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 165 ఐటీ సంస్థలకు చెందిన 380 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ఐఏ ఐజీ అలోక్ మిట్టల్, బీవీఆర్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిధులుగా హాజరై సదస్సును ప్రారంభించారు.

అనంతరం అలోక్ మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీపై ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. సైబర్ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని ఇటీవలి కాలంలో నేరాలు ఎక్కువయ్యాయని.. పోలీసులు ఈ సాంకేతిక పరిజ్ఞానంపైనా పట్టు పెంచుకోవాలని ఆయన సూచించారు.

సైబరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను కంటికి రెప్పలా కాపాడటంలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. అనంతరం ఇజ్రాయిల్ సైబర్ డిఫెన్స్ మాజీ డైరెక్టర్ జనరల్ బుకీ కార్మెలీ తన దేశానికి చెందిన సైబర్ పాలసీలపైనా, రోనాల్డ్ క్లౌటీయర్ సైబర్ రెస్లీయన్స్‌పైనా ప్రసంగించారు. ఉత్తమ సైబర్ సెక్యూరిటీ అందించినందుకు గాను  హెచ్ఎస్‌బీసీ, ఇన్ఫోసిస్‌లను ఎస్సీఎస్సీ అవార్డులు అందజేసింది.