Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో రికార్డు స్థాయిలో కేసులు: ఒక్క రోజులో 499 మందికి పాజిటివ్, 6,525కి చేరిన సంఖ్య

తెలంగాణలో కరోనా కేసుల ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 499 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,525కి చేరింది. 

499 new corona cases reported in telangana
Author
Hyderabad, First Published Jun 19, 2020, 9:36 PM IST

తెలంగాణలో కరోనా కేసుల ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 499 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,525కి చేరింది. ఇవాళ ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 198కి చేరుకుంది.

రాష్ట్రంలో 2,976 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 3,352 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్నట్లుగానే హైదరాబాద్‌లో 329 కేసులు నమోదవ్వగా, రంగారెడ్డిలో 129, మేడ్చల్, మంచిర్యాల, నల్గొండలో నాలుగేసి చొప్పున, మహబూబ్‌నగర్ 6, జనగామ 7 కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్‌లో తాత్కాలిక సచివాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారినపడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి.

కరోనా భయంతో మిగిలిన శాఖల్లోనూ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవలే ఆర్ధిక శాఖలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ ఆఫీసుకు రావడం లేదు.

అత్యవసరమైతే తప్పించి మిగిలిన ఉద్యోగులు కూడా సచివాలయం వైపు తొంగిచూడటం లేదు. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు బీఆర్కే భవన్‌ ఎంట్రన్స్ వద్ద  థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తరచుగా కార్యాలయ ప్రాంగణాన్ని శానిటైజ్ చేస్తున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios