తెలంగాణలో ఇవాళ కొత్తగా 38 మందికి కరోనా వైరస్ సోకగా ఒక్కరోజే ఐదుగురు మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,669కి చేరింది.

ఇవాళ్టీ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 26 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి, మరో 10 మంది వలస కూలీలకు కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మరణించిన ఐదుగురితో కలిసి తెలంగాణలో మొత్తం మరణాల సంఖ్య 45కి చేరింది. ఇవాళ 23 మంది కోలుకోవడంతో మొత్తం 1,036 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

Also Read:షాక్ తింటుందని భార్యకు చెప్పలేదు: కరోనా మృతుడి అంత్యక్రియలపై ఈటల

కాగా కరోనాతో తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ మరణించాడు. కరోనా వైరస్ సోకి మృతి చెందిన వారిలో పోలీసుశాఖలో ఇదే మొదటి కేసు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డి అనే పోలీస్ కానిస్టేబుల్ బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో దయాకర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ విధుల్లో భాగంగా పాతబస్తీలో ఆయన విధులు నిర్వహించాడు.

Also Read:కరోనా మృతుడి అంత్యక్రియల వివాదం: గాంధీ సూపరింటిండెంట్ స్పందన ఇదీ...

ఆదివారం నాడు ఆయనకు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండడంతో ఆయనను బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపితే కరోనా సోకినట్టుగా తేలింది.