వికారాబాద్ జిల్లా  ధారూరు మండలం లోని దోర్నాల తండాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేవలం మూడు వందల జనాభా ఉన్న ఆ చిన్న గ్రామం కరోనా పేరు వింటేనే వణికిపోతోంది.

తండాకు చెందిన ఓ కుటుంబం రెండు వారాల కిందట కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన విందుకు వెళ్లి వచ్చింది. వారం రోజుల తర్వాత క్రమంగా ఆ కుటుంబంలోని వారందరూ అనారోగ్యం బారిన పడుతూ వచ్చారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి కరోనా టెస్టులు చేయగా విందుకు వెళ్లి వచ్చిన వారి కుటుంబంలో 13 మందికి, తండాలోని మరో 25 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 

వీరందరూ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. వీరిలో మంగళవారం ఉదయంరూప్లానాయక్‌ (101) మృతిచెందారు. ఈయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న తాండూరులో ని మహాసేవ యూత్ వెల్ఫేర్ సభ్యులుయ్యద్‌ కమాల్, అక్తర్, సోహెల్, అహ్మద్‌ఉమ్రి, సాకిద్‌మీర్, తౌఫీక్, ఎండీ నజీర్‌ తండా కు చేరుకుని అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదిలా ఉండగా కరోనా బారిన పడడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం లోని కోట్యానాయక్ తండాకు చెందిన బానోతు శంకర్ (45)కు ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇంటికి వెళ్లాక భయంతో పురుగులు మందు తాగాడు. శంకర్ను వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు.