వాటర్ ట్యాంక్ లో పడి 30 కోతులు మృత్యువాత..
వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృత్యువాత పడిన ఘటన నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాటిని మున్సిపల్ సిబ్బంది బుధవారం తొలగించారు. అయితే అవి కొన్ని రోజుల కిందట ట్యాంకులో పడి మరణించి ఉంటాయని, కానీ తాము ఆ నీటిని ఇంత కాలం తాగామని, ఇది తమ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున సాగర్ సమీపంలోని వాటర్ ట్యాంక్ లో 30 కోతులు పడి చనిపోయాయి. దీంతో మున్సిపల్ కార్మికులు వాటర్ ట్యాంక్ నుంచి కోతుల మృతదేహాలను బయటకు తీశారు. అయితే హిల్ కాలనీలోని సుమారు 200 కుటుంబాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు ఉపయోగించే ఈ వాటర్ ట్యాంకులో వానరాలు చనిపోవడం స్థానికంగా కలకలం రేకెత్తించింది.
అయితే ఈ వాటర్ ట్యాంకుపై మున్సిపల్ సిబ్బంది మెటల్ షీట్లను అమర్చారు. మండుతున్న ఎండల కారణంగా కోతులు నీటి కోసం మెటల్ షీట్ల ద్వారా ట్యాంకులోకి ప్రవేశించి ఉండవచ్చని, కానీ బయటకు రాలేక మునిగిపోయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో కోతుల మృతదేహాలు లభ్యమైన వాటర్ ట్యాంక్ లోని నీటిని కొన్ని రోజుల నుంచి తాగుతున్నామని, ఇది తమ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. వాటర్ ట్యాంకు నుంచి కొంత కాలంగా సరఫరా చేస్తుండగా 10 రోజుల క్రితం కోతులు మృతి చెందినట్లు వారు అనుమానిస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.