మేడ్చల్ మైసమ్మగూడలో నీట మునిగిన 30 అపార్ట్‌మెంట్లు: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడలో ని 30అపార్ట్‌మెంట్లు నీటిలో మునిగాయి. ఈ అపార్ట్ మెంట్లలో ఉన్న విద్యార్థులను బయటకు తీసుకు వస్తున్నారు అధికారులు.
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ వద్ద ఉన్న 30 అపార్ట్‌మెంట్లలో వరద నీరు చేరింది. ఒక్కో అపార్ట్ మెంట్ లో ఒకటో అంతస్థు వరకు వరద నీరు చేరింది. ఈ అపార్ట్ మెంట్లలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఉంటున్నారు. అపార్ట్ మెంట్ ఒకటో అంతస్థు వరకు వరద నీరు చేరడంతో ఈ అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు జేసీబీలను రప్పించి అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులను బయటకు తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే మైసమ్మగూడలోని పలు కాలనీల్లో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. వర్షం నీరు వెళ్లే దారి లేక అపార్ట్ మెంట్లను ముంచెత్తింది.
దీంతో ఇవాళ ఉదయం నుండి ఈ అపార్ట్ మెంట్లలో ఉంటున్న విద్యార్థులు భయంతో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. మేడ్చల్ లోని మైసమ్మగూడ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలుంటాయి.ఈ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండే అపార్ట్ మెంట్లలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో పనిచేసే సిబ్బంది కూడ ఈ అపార్ట్ మెంట్లలో ఉంటున్నారు.
పోలీసులు, రెవిన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి నిలిచిపోయిన వర్షం నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని పలు కాలనీల్లో వరద నీరు పోటెత్తింది. చెరువుకు నీళ్లు వెళ్లే మార్గంలో అపార్ట్ మెంట్లు నిర్మించడంతో నీరు వెళ్లే మార్గం లేక అపార్ట్ మెంట్లలోకి వరద నీరు చేరింది. ఇలాంటి నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారనే విషయాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
also read:హైద్రాబాద్‌లో భారీ వర్షం: ప్రగతి భవన్ వద్ద ట్రాఫిక్ జామ్, వాహనదారుల ఇక్కట్లు
ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సమయంలోనే అధికారులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. భవనాల నిర్మాణాలకు అనుమతులకు ఇచ్చే సమయంలో అధికారులు సక్రమంగా వ్యవహరిస్తే ఈ తరహా ఘటనలు జరిగేవి కావని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణాలు చేపట్టిన బిల్డర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.