భువనగిరి: అమాయక మహిళను నమ్మించి మూడేళ్ల బిడ్డను ఓ ముఠా అపహరించిన ఘటన భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు అప్రమత్తతతో కేవలం గంటల వ్యవధిలోనే ఆ బిడ్డ తిరిగి తల్లి ఒడికి చేరింది. 

ఈ కిడ్నాప్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా గార్లపాడు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి పనికోసమని నాలుగురోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లాడు. అయితే అతడు ఇంటికి తిరిగిరాకపోవడం, ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కంగారుపడిన మహిళ తన మూడేళ్ల బిడ్డను తీసుకుని హైదరాబాద్ కు వెళ్లింది. 

ఇలా ఎంజీబిఎస్ కు చేరుకున్న ఆమె ఓ కిడ్నాపర్ల ముఠా కంటబడింది. మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భర్తను వెతకడంలో సహాయం చేస్తామని  ఓ మహిళ, ఇద్దరు పురుషుల ముఠా నమ్మించారు. దీంతో వారు ఆమెను భువనగిరికి తీసుకెళ్లి అక్కడ కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి సదరు మహిళ చేత తాగించారు. దీంతో మహిళ మత్తులోకి జారుకోగా ఆమె బిడ్డను ఎత్తుకెళ్లారు. 

అయితే మత్తు నుండి బయటపడ్డాక తన బిడ్డ కనిపించక పోవడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన భువనగిరి పోలీసులు 
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వారి వద్దనుండి బిడ్డను సురక్షితంగా కాపాడి తల్లి మహేశ్వరికి అప్పగించారు.