తెలంగాణలో కరోనా విలయతాండవం: ఒక్క రోజే 269 కేసులు, 5,675కి చేరిన సంఖ్య
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. బుధవారం కొత్తగా 269 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. బుధవారం కొత్తగా 269 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కి చేరుకుంది.
ఇవాళ వైరస్ కారణంగా ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 192కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 2,412 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు కరోనా కారణంగా 3,071 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇవాళ ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 214 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు తగినంత సన్నద్ధత కనిపించడం లేదంటూ హైకోర్టు మండిపడింది.
రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్ధితి మరింత దారుణంగా తయారైందని... వైద్య సిబ్బందికి తగినన్న పీపీఈ కిట్లు ఇవ్వటం లేదన్న పిల్‌పై ఉన్నత న్యాయస్ధానం బుధవారం విచారణ జరిపింది.
దీనిలో భాగంగా పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయో, సిబ్బందికి ఎన్ని ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేపటిలోగా వివరాలు అందజేయాలని గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, ఫీవర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లను న్యాయస్ధానం ఆదేశించింది.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు కరోనా వ్యాపించిందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ 19 నివారణపై ప్రభుత్వానికి ఆసక్తి, ఉత్సాహం పోయాయన్న హైకోర్టు.. ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్న ధోరణిలో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు పెంచాలని మూడు వారాలుగా చెబుతున్నా తమ ఆదేశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని న్యాయస్ధానం అసహనం వ్యక్తం చేసింది. మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే అలాగే ఉంటామని చెప్పింది. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ప్రజలందరికీ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరీక్షలు తక్కువగా చేస్తే కరోనా వ్యాప్తి తీవ్రత ఎలా తెలుస్తుందని నిలదీసింది.