తెలంగాణలో ఇకపై బీర్లే బీర్లు ... కానీ కేఎఫ్, బడ్వైజర్ అంటే కుదరదు... అంతా దబాంగ్, హంటర్లే...?
తెలంగాాణలో ప్రస్తుతం బీర్ల చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మధ్యం ఏరులై పారుతోందని ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏ చేస్తోంది ఏంటంటూ బిఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇలా కొత్తకొత్త బీర్ల పేర్లు వినిపించడంపై వివాదం సాగుతోంది.
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మద్యం ప్రియులకు ఇబ్బందులు మొదలయ్యాయి. బిఆర్ఎస్ అధికారంలో వుండగా వైన్స్, బార్లలో విరివిగా లభించిన పాపులర్ బీర్ బ్రాండ్లు ప్రస్తుతం చూద్దామన్నా కనిపించడం లేదు. ముఖ్యంగా కింగ్ ఫిషర్ లైట్ బీర్ల కొరత తెలంగాణలో మామూలుగా లేదు. అయితే కెఎఫ్ బీర్ల కొరత ప్రభుత్వం సృష్టించినదేనని... దీని వెనక కాంగ్రెస్ పెద్దల హస్తం వుందని ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలాగే ప్రస్తుతం తెలంగాణలో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తెలంగాణలో కొత్త బ్రాండ్ బీర్ల అమ్మకాలకు ప్రొహిబిషన్ ఆండ్ ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమ్ డిస్టిలరీస్ తో పాటు టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జొటికా లాంటి కంపనీలు కూడా మద్యానికి మంచి డిమాండ్ వున్న తెలంగాణ మార్కెట్ లోకి ప్రవేశించేందుకు సిద్దమయ్యాయి. ఈ మేరకు అన్ని అనుమతులు పొందిన ఈ కంపనీలు 26 రకాల బీర్లను తెలంగాణలో సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో దబాంగ్, హంటర్, పవర్ 10000, బ్లాక్ ఫోర్ట్ వంటి కొత్తకొత్త పేర్లతో బీర్లు వున్నట్లు సమాచారం.
అయితే ఈ కొత్తకొత్త బీర్ల వెనక కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పెద్దల స్వలాభం వుందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో సోమ్ డిస్టిలరీస్ కాంగ్రెస్ పార్టీకి భారీగా ఫండింగ్ చేసిందని... అందువల్లే ఈ కంపనీకి తెలంగాణలో అనుమతిచ్చారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కమీషన్ల కోసం మరికొన్ని కంపనీలకు కూడా అనుమతిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో పాపులర్ బ్రాండ్స్ బీర్ల కొరత, కొత్త బీర్లకు అనుమతిపై వివాదం సాగుతోంది.
కేఎఫ్ బీర్ల కొరత అందుకోసమేనా :
ఎండాకాలంలో బీర్లకు మంచి గిరాకీ వుంటుంది... విస్కీ, బ్రాందీ తాగేవారు కూడా సమ్మర్ లో చల్లచల్లని బీర్లనే ఇష్టపడుతుంటారు. అయితే సహజంగానే మద్యం ప్రియులు ఎక్కువగా వుండే తెలంగాణలో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో వుంటాయి. కానీ ఈ సమ్మర్ లో బీర్ల కొరత ఏర్పడింది... ముఖ్యంగా కెఎఫ్ లైట్ బీర్లు వైన్స్, బార్లలో కనిపించకుండాపోయింది.
అయితే ఇలా ఎక్కువగా అమ్ముడుపోయే బీర్ల కొరత సహజంగా జరిగింది కాదని ... కృత్రిమ కొరత సృష్టించారని ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు అనుకూలంగా వుండే కంపనీల కోసమే రేవంత్ సర్కార్ ఈ కొరత సృష్టించిదని ఆరోపిస్తున్నారు. దీన్ని సాకుగా చూపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే బ్రాండ్లను తెలంగాణలోకి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా బీర్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ జోక్యం చేసుకుంది. తెలంగాణలో ప్రస్తుతం ఆరు బెవరేజేస్ వున్నాయని... సాధారణంగా ఇవన్నీ ఒక్క షిప్ట్ మాత్రమే పనిచేస్తాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కానీ వేసవిలో డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మరింత ఎక్కువగా బీర్లను ఉత్పత్తి చేసేందుకు మూడు షిప్టులు పనిచేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. కానీ కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తి సంస్థ మాత్రం అన్నిమతులు ఇచ్చినా డిమాండ్ కు తగినట్లు బీర్లను తయారీ చేయలేకపోతోందని...అందువల్లే ఆ బీర్ల కొరత ఏర్పడుతోందని ఎక్సైజ్ శాఖ వివరణ ఇచ్చింది.
మరో వాదన :
ఇక తెలంగాణలో బీర్ల కొరతపై మరో వాదన కూడా ప్రచారంలో వుంది. రాష్ట్రంలో బీర్ల సరఫరాలో మెజారిటీ వాటా యూబీ కంపనీదే... ప్రముఖ బ్లాండ్స్ కింగ్ ఫిషర్, బడ్వైజర్ సరఫరా చేసేది కంపనీ. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపనీకి సుమారు రూ.450 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందట... అందువల్లే బీర్ల సరఫరాను తగ్గించినట్లు తెలుస్తోంది.అందువల్లే బాగా సేల్ వుండే కింగ్ ఫిషర్ బీర్ల కొరత ఏర్పడింది అనేది మరో వాదన.