హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సాధారణ ప్రజలు కూడా పోటీ పడుతుండటం విశేషం. ఇటీవల జరిగిన నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో... ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక కూడా అదే మాదిరిగా మారింది. 

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ పెద్దసంఖ్యలో పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేసినట్లుగానే.. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల పట్ల వివక్ష చూపుతోందంటూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్‌లు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 

తద్వారా సర్కారుకు తమ సత్తా చాటుతామని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో వీరంతా బరిలోకి దిగనున్నారు. ‘హలో సర్పంచ్‌.. చలో హుజూర్‌నగర్‌’ పేరుతో ఈ నెల 29, 30 తేదీల్లో తాము నామినేషన్లు దాఖలు చేయనున్నుట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదామి భూమన్నయాదవ్‌ తెలిపారు. 

ప్రభుత్వ వైఖరికి నిరసనగానే తాము పోటీ చేస్తున్నట్లు బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నామినేషన్లు వేయడమే కాకుండా.. నియోజకవర్గంలో గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామన్నారు.