శంషాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్ ఎరీనా గ్రౌండ్‌లో జరిగిన సన్ బన్ లైవ్ కాన్సర్ట్ షో చూడటానికి వచ్చిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

మృతుడిని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మస్కల తులసీరామ్‌గా గుర్తించారు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తన మిత్రులతో కలిసి అతను షో చూడటానికి శంషాబాద్ వచ్చాడు.

ఈ సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురైన తులసీరామ్ పక్కనే సేద తీరాడు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత అతను కనిపించకపోవడంతో స్నేహితులు చుట్టుపక్కల వెతికారు.

నిర్వాహకులను ప్రశ్నించగా.. ఓ యువకుడు అపస్మారక స్థితిలో ఉంటే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సమీపంలోని అన్ని ఆసుపత్రుల్లో ఆరా తీసిన వారికి తులసీరామ్ ఎక్కడ కనిపించకపోవడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లారు.

అక్కడ తులసీరామ్ శవమై కనిపించాడు. అతని శరీరంపై గాయాలు, రక్తపు మరకలు కనిపించడంతో తులసీరామ్ ‌మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.