జిమ్ లో వ్యాయామం చేస్తూ ఓ 24 యేళ్ల యువ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.   

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. 24 సంవత్సరాల ఓ యువ పోలీస్ జిమ్ లో కసరత్తులు చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన జిమ్ సిబ్బంది అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లుగా ధ్రువీకరించారు. చనిపోయిన కానిస్టేబుల్ పేరు విశాల్. బోయిన్పల్లికి చెందిన వ్యక్తి. 2020 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రస్తుతం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

చిన్న వయసులోనే ఉద్యోగం పొందాడు. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. తనకెంతో ఇష్టమైన పోలీస్ శాఖలో ఉద్యోగం రావడంతో జీవితంలో స్థిరపడ్డాడు. అంతలోనే 24 యేళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధతో నిత్యం వ్యాయామం, జిమ్ చేస్తూ ఉండేవాడు. గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయి మరణించడం.. అంతా సెకండ్లలో జరిగిపోవడం అందరిని కలచివేసింది.

కిడ్నీ, గుండె పనితీరు మెరుగు: మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల

ఇటీవలి కాలంలో ఇలాంటి మరణాలు ఎక్కువ అవుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్య హీరో నందమూరి తారకరత్న, కొంతకాలం క్రితం కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజకుమార్ కూడా జిమ్ లో వ్యాయామం చేస్తూనే గుండెపోటుకు గురికావడం తెలిసిందే.