భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కోరలు చాస్తోంది. ప్రజల ప్రాణాలు కాపాడే పోలీసులు సైతం మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయిందని సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రకటించారు.

ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో 95 శాతం మంది సిబ్బందికి వ్యాక్సినేషన్ జరిగిందని ఆయన చెప్పారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. కొవిడ్ పాజిటివ్‌ వచ్చిన వారిలో ఆత్మస్థైరం పెంపొందించేందుకు తనతోపాటు ఇతర అధికారులు జూమ్‌ ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని మహేశ్ భగవత్ పేర్కొన్నారు.

పాజిటివ్‌గా నిర్థారణ అయిన వారిలో కేవలం నలుగురు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. వైరస్‌ బారిన పడ్డవారికి మెడికల్‌ కిట్స్‌, డ్రైఫ్రూట్స్‌ కిట్స్‌తో పాటు రూ. 5 వేలు వారి ఖాతాల్లో వేస్తున్నామని మహేశ్ భగవత్ వెల్లడించారు.

Also Read:తెలంగాణలో ఆగని కరోనా ఉధృతి: ఒక్క రోజులోనే 6 వేలు దాటిన కేసులు, 29 మంది మృతి

మరోవైపు రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కమిషనరేట్‌ పరిధిలో 43 ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు.

రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సిబ్బంది విధుల్లో ఉంటారని ఆయన పేర్కొన్నారు. కమీషనరేట్ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇప్పటి వరకు 200 మందిపై కేసులు నమోదు చేశామని మహేశ్ భగవత్ వెల్లడించారు.

వారం రోజుల వ్యవధిలో మాస్కులు ధరించని వారిపై 16 వేల కేసులు నమోదు చేసినట్లు సీపీ చెప్పారు. 90 శాతం దుకాణాలు, బార్లు, మద్యం షాపులు, కార్యాలయాలు రాత్రి 8 గంటలకు మూసివేస్తున్నారని మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.