‘ మేం చూసుకుంటాం.. మీరు వెళ్లండి’ అన్నారు.. అంతలోనే..

First Published 23, May 2018, 11:14 AM IST
21-year-old son of BJP MP Bandaru Dattatreya dies of heart attack
Highlightsతెల్లవారుజాము 5గంటల దాకా ఈ విషయం దత్తాత్రేయకు తెలియదు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం అర్థరాత్రి 1గంట సమయంలో దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్.. గుండె పోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఒక్కగానొక్క కుమారుడు అతి చిన్నవయసులో చనిపోవడంతో దత్తాత్రేయ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

హైదరాబాద్ రాంనగర్‌లోని నివాసంలో మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తుండగా బండారు వైష్ణవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బండారు దత్తాత్రేయ. డాక్టర్ ఆవుల రామచంద్రరావు తదితరులు సమీపంలోనే ఉన్న గురునానక్ కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ‘సార్.. ఏం కాదు.. మేము చూసుకుంటాం కదా మీరు ఇంటికెళ్లండి’ అని రామచంద్రారావు తదితరులు చెప్పడంతో ఎంపీ దత్తాత్రేయ ఇంటికెళ్లి నిద్రపోయారు. తరువాత పన్నెండున్నర గంటల సమయంలో వైష్ణవ్ మరణించాడని డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. అయితే తన కుమారుడు మరణించిన విషయం దత్తాత్రేయకు ఉదయం 5 గంటలదాకా తెలియదు.

మీడియా ప్రతినిధుల ద్వారా విషయం తెలుసుకున్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ రాత్రి ఒంటి గంటకు వచ్చి పరామర్శించి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తెల్లవారు మూడు గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. వైష్ణవ్ మరణించిన విషయం తెలుకుని.. ఆ విషాద వార్తను దత్తాత్రేయకు ఉదయం 5 గంటలకు ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తెలుకున్న దత్తాత్రేయ హుటాహుటిన తన సతీమణితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. జీవం లేని కుమారుడిని చూసి బోరున విలపించారు.

loader