Asianet News TeluguAsianet News Telugu

2018 ఈయర్ రౌండప్: కాంగ్రెస్‌తో జత కట్టినా టీడీపీకి కలిసి రాలేదు

 తెలంగాణలో టీడీపీకి 2018 సంవత్సరం కలిసి రాలేదు. గత ఏడాది  నుండి ఆ పార్టీకి ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో  పార్టీ ఉనికి నిలుపుకొనే ప్రయత్నం  చేస్తోంది

2018 year round up: tdp lost 13 seats this elections
Author
Hyderabad, First Published Dec 25, 2018, 7:31 PM IST

హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి 2018 సంవత్సరం కలిసి రాలేదు. గత ఏడాది  నుండి ఆ పార్టీకి ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో  పార్టీ ఉనికి నిలుపుకొనే ప్రయత్నం  చేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లోనే ఆ పార్టీ విజయం సాధించింది. టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడ టీఆర్ఎస్ గాలం వేస్తోంది.

గత ఏడాది చివర్లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా కీలకమైన నేతలు టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీకి చెందిన క్యాడర్ ఎక్కువగా టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల్లో చేరింది.

ఇంకా కొందరు నేతలు టీడీపీలో కొనసాగుతున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీ భావించింది. కానీ, టీడీపీతో పొత్తును టీఆర్ఎస్ తోసిపుచ్చింది.

దీంతో తెలంగాణలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది.  కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలతో  టీడీపీ పీపుల్స్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసింది.

ఈ ఎన్నికల్లో టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేసింది. అయితే కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వరావుపేట, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో  టీడీపీ అభ్యర్థులు మచ్చా నాగేశ్వర్ రావు, సండ్ర వెంకటవీరయ్య విజయం సాధించారు.

మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని  సాధించింది. కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుండి నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని, శేరిలింగంపల్లి నుండి సినీ నిర్మాత ఆనంద్ ప్రసాద్ పోటీ చేశారు.

కూకట్‌పల్లిలో సుహాసిని కూడ ఓటమి పాలైంది. తెలంగాణలో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులతో పాటు పీపుల్స్ ఫ్రంట్ కూటమి అభ్యర్థుల తరపున ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించారు.

చంద్రబాబునాయుడు ప్రచారంపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సెంటిమెంట్‌ను రగిల్చారు.  తెలంగాణపై  చంద్రబాబునాయుడు పెత్తనం చేసేందుకు వస్తున్నారని టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో  కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ చీఫ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో  వైసీపీ,జనసేనలు పరోక్షంగా తెలంగాణ ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు సహకరించాయని టీడీపీ పలు సమయాల్లో విమర్శలు గుప్పించింది.

తెలంగాణ ఎన్నికల్లో  వైసీపీ, జనసేనలు  పోటీ చేయకుండా పరోక్షంగా టీఆర్ఎస్‌కు మద్దతిచ్చినట్టు టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.తెలంగాణ ఎన్నికల్లో  టీడీపీ విజయం కోసం  చంద్రబాబునాయుడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు. అయితే 2014 ఎన్నికల్లో  టీడీపీ 15 అసెంబ్లీ, ఒక్క ఎంపీ స్థానంలో విజయం సాధించింది.

ఈ దఫా కేవలం రెండు స్థానాలతోనే టీడీపీ సరిపెట్టుకొంది.  అయితే ఈ రెండు స్థానాలు కూడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుండి విజయం సాధించినవే కావడం గమనార్హం. ఈ ఇద్దరిని కూడ టీఆర్ఎస్‌లో చేర్చుకొనేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడ టీఆర్ఎస్ లో చేర్చుకొంటే అసెంబ్లీలో టీడీపీ ఉనికి లేకుండా పోతోంది. తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా చేయాలనే ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. 

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ.... ఈ దఫా ఆ పార్టీతో జత కట్టింది. తెలంగాణలో ప్రజా కూటమి ఏర్పాటులో టీడీపీ కీలకంగా పనిచేసింది. మరో వైపు దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకంగా టీడీపీ కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొంది. వచ్చే ఐదేళ్లపాటు పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడం ఆ పార్టీ నాయకత్వానికి ఇబ్బందేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

2018 ఈయర్ రౌండప్: విపక్షాలకు చెక్, టీఆర్ఎస్‌దే అధికారం
2018 ఈయర్ రౌండప్: కమ్యూనిష్టులకు కలిసి రాలేదు

Follow Us:
Download App:
  • android
  • ios