హైదరాబాద్ సనత్‌నగర్‌లో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి మీదకు యువకులు కారును ఎక్కించడంతో పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  

పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. నిత్యం ఎన్నో విషాదాలు జరుగుతున్నా హైదరాబాద్ నగరంలో (hyderabad) ర్యాష్ డ్రైవింగ్‌లు (rash driving) మాత్రం తగ్గడం లేదు. తాజాగా సనత్‌నగర్‌లో (sanathnagar) దారుణం జరిగింది. రెండేళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు యువకులు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ సమయంలో ఓ కారు పాప మీదుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే కారులోని యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.