హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణలో చిక్కుకొన్న వలస కార్మికులను  జార్ఖండ్ రాష్ట్రానికి తరలించేందుకు ప్రత్యేక రైలు శుక్రవారం నాడు ఉదయం బయలుదేరింది.

కంది ఐఐటీలో ఉన్న వలస కార్మికులను ఇవాళ ఉదయం ప్రత్యేక బస్సుల్లో లింగంపల్లి రైల్వే స్టేషన్ కు తరలించారు. లింగంపల్లి రైల్వేస్టేషన్ నుండి ప్రత్యేక రైలు 1200 మంది వలస కార్మికులను తీసుకొని లింగంపల్లి నుండి జార్ఖండ్ రాష్ట్రంలోని హటియాకు బయలుదేరింది. ఈ రైలుకు 24 కోచ్ లు ఉన్నాయి.

సాధారణంగా ప్రతి కోచ్ లో 72 మంది ప్రయాణం చేస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రతి కోచ్ లో కేవలం 54 మంది మాత్రమే ప్రయాణం చేసేందుకు వీలుగా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.

వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకు రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వినతి మేరకు  ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొంటామని రైల్వే శాఖ ఏర్పాట్లు చేయనుందని రైల్వే శాఖ అధికారి ప్రకటించారు.

కరోనా లక్షణాలు లేని విద్యార్థులు, వలస కార్మికులను తమ స్వంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా వలస కార్మికులను తరలించారు.

కేంద్రం ఆదేశాల మేరకు పంజాబ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖను కోరాయి. జార్ఖండ్ రాష్ట్రం కూడ వలస కూలీల తరలింపు కోసం కేంద్రాన్ని రైళ్లు ఏర్పాటు చేయాలని కోరింది. 

జార్ఖండ్ రాష్ట్రంలో  పెద్ద ఎత్తున రవాణా వనరులు లేవు.దీంతో తమ రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు వలస కూలీలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి బన్న గుప్తా కోరారు.

రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుండి సుమారు 9 లక్షల మంది వలస కూలీలు వచ్చే అవకాశం ఉందని గుప్తా చెప్పారు. వీరందరికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య సేతలు యాప్ ద్వారా వారిని మానిటర్ చేయనున్నట్టుగా తెలిపారు.

ప్రతి బ్లాక్, డివిజన్ స్థాయిల్లో పెద్ద ఎత్తు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా గుప్తా చెప్పారు. దీనికి పెద్ద ఎత్తున మెడికల్ కిట్స్ అవసరమౌతాయన్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను స్వంత రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని తాను చేసిన వినతికి కేంద్రం అంగీకరించిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చెప్పారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఉదయం ఆయన ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

వలస కూలీలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం తమకు ముఖ్యమన్నారు. ప్రతి ఒక్క జార్ఖండ్ వాసిని సెక్యూరిటీ కల్పించడం తమ ప్రాధాన్యతగా ఆయన చెప్పారు.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: 2660 వలస కార్మికులు సంగారెడ్డి నుండి జార్ఖండ్‌కు తరలింపు

లాక్ డౌన్ నేపథ్యంలో లక్షలాది మంది వలస కూలీలు తమ స్వంత రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల్లో నిలిచిపోయిన విషయం తెలిసిందే.లాక్ డౌన్  కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడింది. వేలాది మంది వలస కూలీలు రవాణ సౌకర్యం లేక తమ ఇళ్లకు నడుచుకొంటూ వెళ్లారు. కూలీలు ఉపాధి కోల్పోయారు.