Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు ఈసారి కష్టమేనా.. గజ్వేల్‌లో 157 నామినేషన్లు, పోటీదారులంతా బీఆర్ఎస్ బాధితులే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌కు ఈసారి ఎన్నికల్లో నెగ్గుకురావడం అంత ఆషామాషీగా కనిపించడం లేదు.  గజ్వేల్ , కామారెడ్డిలు కలిపి అత్యధికంగా నామినేషన్‌లు దాఖలయ్యాలయి.. ఇందులో ఒక్క గజ్వేల్ నుంచే 157 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 
 

157 nominations filed from gajwel for telangana assembly elections ksp
Author
First Published Nov 11, 2023, 9:57 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌‌కు ఈసారి ఎన్నికల్లో నెగ్గుకురావడం అంత ఆషామాషీగా కనిపించడం లేదు. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గజ్వేల్‌లో ఓటమి ఖాయమని తెలిసే కేసీఆర్ కామారెడ్డిలోనూ బరిలోకి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడా ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనూహ్యంగా గజ్వేల్ నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్, కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగడంతో కేసీఆర్‌కు టఫ్ ఫైట్ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. గజ్వేల్ , కామారెడ్డిలు కలిపి అత్యధికంగా నామినేషన్‌లు దాఖలయ్యాలయి.. ఇందులో ఒక్క గజ్వేల్ నుంచే 157 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

ప్రభుత్వ నిర్ణయాల వల్ల బాధితులుగా మారిన కొందరు కేసీఆర్‌పై పోటీకి దిగారు. వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు దాదాపు 100 మంది కేసీఆర్‌పై నామినేషన్ దాఖలు చేశారు. అలాగే జగిత్యాల చెరుకు రైతులు.. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ పోటీకి దిగారు. వీరితో పాటు నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు, ధరణి బాధితులు తమ నిరసన తెలియజేసేందుకు నామినేషన్లు వేశారు. 

ALso Read: CM KCR : పడిలేచిన కెరటం.. ఉద్యమ నాయకుడు నుంచి పాలకుడుగా.. సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం..

కామారెడ్డి నుంచి 102 నామినేషన్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత మేడ్చల్‌లో 125 , మునుగోడులో 83, సూర్యాపేటలో 81, మిర్యాలగూడలో 79, సిద్ధిపేటలో 76, నల్గొండలో 71, హుజురాబాద్‌లో 70, కోదాడలో 66, రాజేంద్రనగర్‌లో 64, మల్కాజిగిరిలో 60, ఎల్బీ నగర్‌లో 62, శేరిలింగంపల్లిలో 58, సిరిసిల్లలో 42 నామినేషన్లు దాఖలయ్యాయి. గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో కేసీఆర్ కుమార్తెకు ఇదే రకమైన అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.

పసుపు రైతులు, ఇతరులు కవితపై భారీగా నామినేషన్లు వేయగా.. ఆమె అనూహ్యంగా ఓటమి పాలు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ షాక్ నుంచి బీఆర్ఎస్ శ్రేణులు చాలా రోజుల వరకు కోలుకోలేకపోయారు. ఇప్పుడు అదే స్థాయిలో కేసీఆర్‌పై నామినేషన్లు దాఖలు కావడంతో గులాబీ శ్రేణులు భయాందోళనకు గురవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios