కాచిగూడ ప్రాంతంలోని  ఓ హాస్టల్లో విద్యార్థులంతా ఇవాళ ఉదయం ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది అనారోగ్యంపాలైన
విద్యార్థులను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు చికిత్స పొందుతున్నట్లు...ఎవరికీ ప్రాణహాని లేదని తెలపడంతో తల్లిదండ్రులతో పాటు హాస్టల్
సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. 

కాచిగూడ లోని ఓ హాస్టల్లో విద్యార్థులు నివాసముంటూ చదువుకుంటున్నారు. ఇవాళ ఆదివారం సెలవురోజు కావడంతో అందరు విద్యార్థులు హాస్టల్లోనే వున్నారు.అయితే హాస్టల్లో కొద్దిసేపటిక్రితమే భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 15మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటూ తీవ్రంగా నీరసించిపోయారు. 

ఇలా ఒకేసారి చాలామంది విద్యార్ధులు తీవ్రంగా అనారోగ్యానికి గురవడంతో హాస్టల్ సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే వారిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది.  ప్రస్తుతం  విద్యార్థులంతా కోలుకుంటున్నారని... ఎవరి ప్రాణాలకు ఎలాంటి  ప్రమాదం లేదని డాక్టర్లు వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు ఇలా అనారోగ్యానికి గురయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు ఇలా అనారోగ్యానికి గురయ్యారని వారు ఆరోపిస్తున్నారు.