హైదరాబాద్ లో భారీ పేలుడు ... 15 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. రాజేంద్ర నగర్ లోని ప్రముఖ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 15 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి మరింత విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
రాజేంద్ర నగర్ గగన్ పహాడ్ ప్రాంతంలోని కరాచీ బేకరీలో కార్మికులు పనుల్లో మునిగివుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు కిచెన్ మొత్తం వ్యాపించాయి. దీంతో కిచెన్ లో పనిచేసే 15 మంది గాయపడ్డారు... వీరిలో ఆరుగురి పరస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.
గ్యాస్ పేలుడు దాటికి బేకరి చుట్టుపక్కల ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. భారీ శబ్దంతో గ్యాస్ పేలడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగుతీసారు. అలాగే పేలుడు జరిగిన కరాచీ బేకరిలో వున్నవారు కూడా భయంతో బయటకు పరుగుతీసారు.
ఇక గ్యాస్ పేలుడులో గాయపడ్డ కార్మికుల్లో ఎక్కువమంది ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని సమాచారం. మంటల్లో చిక్కుకుని గాయపడ్డ వారిని బేకరీ యాజమాన్యం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసారు. అలాగే పోలీస్ అధికారులు కూడా ప్రమాదం జరిగిన బేకరీని పరిశీలించారు.
కరాచీ బేకరీ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారి వివరాలు తెలియాల్సి వుంది. .