ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటనకు అనుమతించాలంటూ ఆందోళన చేపట్టిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు 14 రోజుల రిమాండ్ కు తరలించారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ క్యాంపస్ లో పర్యటిస్తారని టి కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకోసం ఓయూ వైస్ చాన్సలర్ అనుమతి కోరగా ఆయన నిరాకరించడంతో కాంగ్రెస్ శ్రేణేలే భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే విసి తీరును నిరసిస్తూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ నేతృత్వంలో ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టడి చేపట్టారు. దీంతో ఓయూ రణరంగంగా మారింది. 

ఎన్‌ఎస్‌యూఐ నాయకులు భారీగా ఓయూ పరిపాలనా భవనం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అద్దాలు, పర్నీచర్ ద్వంసం చేసారు. ఓయూ సెక్యూరిటీ సిబ్బంది, పొలీసులు అడ్డుకున్నప్పటికి వారిని తోసుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోకి వెళ్లారు. విసి తీరుకు నిరసనగా గాజాలు, చీరలు కార్యలయంలో పెట్టారు. ఎన్‌ఎస్‌యూఐ నాయకులు అదుపుచేయడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు బల్మూరి వెంకట్ తో పాటు 18మంది కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇలా ఓయూలో ఆందోళన చేపట్టిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులపై పోలీసులు సీరియస్ అభియోగాలు మోపారు. మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసారు. దీంతో బల్మూరి వెంకట్ తో పాటు 18మంది ఎన్‌ఎస్‌యూఐ నాయకులను పోలీసులు 14రోజుల పాటు రిమాండ్ కు తరలించారు. 

ఇక ఓయూలో ఆందోళనకు దిగిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులకు మద్దతుగా నిలిచేందుకు ఓయూకు బయలుదేరిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. బంజారాహిల్స్ లో జగ్గారెడ్డిని అడ్డుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసుల కస్టడీలో వున్న జగ్గారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులను మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ మంత్రి గీతారెడ్డి పరామర్శించారు.

రాహుల్ ఓయూ పర్యటన లేనట్లే:

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 6, 7 తేదీల్లో తెలంగాణలో వుండనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మే 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు రాహుల్. అనంతరం శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో వరంగల్ బయల్దేరతారు. తర్వాత వరంగల్‌లో రైతు సంఘర్షణ సభకు హాజరవుతారు. రాత్రి 7 గంటలకు సభనుద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారు.. అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు. 

రాత్రికి దుర్గం చెరువు పక్కనే ఉన్న కోహినూర్ హోటల్‌లో రాహుల్‌ బస చేస్తారు. తర్వాతి రోజు (మే 7న) ఉదయం కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి కోహినూర్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేస్తారు రాహుల్. అనంతరం సంజీవయ్య పార్కులో నివాళులు అర్పించే కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. తర్వాత గాంధీభవన్‌లో 200 మంది ముఖ్యనేతలతో సమావేశమవుతారు. అనంతరం డిజిటల్ మెంబర్ షిప్ ఫొటో సెషన్‌లో పాల్గొంటారు. తర్వాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు. 

అధికారుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రద్దయ్యింది. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రాహుల్ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో పర్యటించాలని కోరుకుంటున్నారు.