Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం .. అభిషేక్‌కు 14 రోజుల రిమాండ్, ఫోరెన్సిక్ ల్యాబ్‌కి విజయ్ ల్యాప్‌టాప్‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. స్కామ్‌లో రూ.100 కోట్లు చేతులు మారాయని.. విజయ్ నాయర్ ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని ఈడీ అధికారులు తెలిపారు. 

14 days judicial remand for abhishek boyinapalli in delhi liquor scam
Author
First Published Nov 24, 2022, 3:56 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అభిషేక్ కస్టడీ ముగియడంతో అధికారులు అతడిని గురువారం కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్నందున రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరో నిందితుడు విజయ్ నాయర్‌ను మరో 4 రోజులు కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రూ.100 కోట్లు చేతులు మారాయని ఈడీ తెలిపింది. విజయ్ నాయర్ ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని.. లిక్కర్ స్కాంలో ల్యాప్ టాప్ కీలకమని ఈడీ అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రేపు నివేదిక వస్తుందని వారు చెప్పారు. 

ఇదే కేసులో ఇతర నిందితులైన శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబుకు జైలులో ఇంటి నుంచి ఆహారం తెచ్చేందుకు నిరాకరించింది కోర్ట్. ఏదైనా కావాలనుకుంటే జైలు అధికారులకు చెప్పి చేయించుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే కొన్ని పుస్తకాలు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించాలని నిందితులు కోరగా... అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. అన్ని పుస్తకాలు జైలులోనే దొరుకుతాయని పేర్కొన్నారు. 

ALso REad:లంచాలు ఇచ్చారిలా... 2 నెలల ముందే విజయ్ నాయర్ చేతికి లిక్కర్ పాలసీ : ఈడీ రిపోర్ట్‌లో కీలకాంశాలు

అంతకుముందు గతవారం విజయ్ నాయర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలకు రూ.30 కోట్లు అడ్వాన్స్ చెల్లింపులు జరిగాయని ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీ తయారీలో విజయ్ నాయర్ కీలకపాత్ర పోషించినట్లు తెలిపింది. అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌లు కలిసి లంచాలు ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. 

హోల్‌సేలర్ల నుంచి డబ్బులు వసూలు చేసి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారని.. విజయ్ నాయర్ తనను తాను ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నారని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఎక్సైజ్ పాలసీని తమ వారికి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు తెలిపింది. పాలసీ తయారీకి 2 నెలల ముందే విజయ్ నాయర్‌ చేతుల్లోకి వచ్చేసిందని ఈడీ తెలిపింది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios