దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన హింసాత్మక సంఘటనలపై 13 ప్రతిపక్ష పార్టీల నాయకులు శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషిస్తానని చెబుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఈ ప్రకటనలో భాగం కాలేదు.

దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన హింసాత్మక సంఘటనలపై 13 ప్రతిపక్ష పార్టీల నాయకులు శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీ మౌనం వహించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని వారు పేర్కొన్నారు. దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని దేశ ప్రజలను కోరారు. ఈ విధ‌మైన దాడుల‌కు దిగే మూక‌ల‌కు ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వ తీరు అధికారి ప్రోత్సాహం అందించే విధంగా ఉందని విమర్శించారు. ప్ర‌జ‌ల ఆహారం, వేషధారణ, విశ్వాసం, పండుగలు, భాషను సైతం సమాజాన్ని విడగొట్టేందుకు ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు 13 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా సంయుక్త ప్రకటన చేశాయి. 

ప్రకటనపై సంతకం చేసినవారిలో కాం గ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(టీఎంసీ), తమిళనాడు సీఎం స్టాలిన్ (డీఎంకే), జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్(జేఎంఎం), ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన దేబబ్రత బిశ్వాస్, ఆర్‌ఎస్‌పీకి చెందిన మనోజ్ భట్టాచార్య, ముస్లిం లీగ్‌కు చెందిన పీకే కున్హాలికుట్టి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌కు చెందిన దీపాంకర్ భట్టాచార్య ఉన్నారు.

అయితే గత కొన్ని నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విరుచుకుపడుతున్నారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ.. మత, విభజన రాజకీయాలు చేస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణపై వివక్ష చూపుతోందని కూడా ఆరోపించారు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తానని.. బంగారు భారత్‌ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తానని ప్రకటించారు. ఇందుకోసం ఆయన పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. 

ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌లతో.. సంప్రదింపులు జరిపారు. అయితే మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ ఈ నేతలు కలిసి చేసిన ప్రకటనకు మాత్రం గులాబీ బాస్ దూరంగా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుపుతున్న కేసీఆర్.. ఈ ఉమ్మడి ప్రకటనపై ఎందుకు సంతకం చేయలేదనే దానిపై మాత్రం టీఆర్‌ఎస్ నేతలు మౌనం పాటించారు.

మరోవైపు మహారాష్ట్రలో.. కాంగ్రెస్, ఎన్‌సీపీతో పొత్తులో ఉన్న శివసేన కూడా ఈ ప్రతిపక్షాల సంయుక్త ప్రకటనలో భాగం కాకపోవడం గమనార్హం. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిగా మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.