తెలంగాణలో గడిచిన కొద్దిరోజుల నుంచి ఉగ్రరూపం చూపుతున్న కరోనా వైరస్ కాస్త కూడా దయ చూపడం లేదు. తాజాగా శుక్రవారం 1,278 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కు చేరింది. ఇవాళ 8 మంది మరణించడంతో... మొత్తం మృతుల సంఖ్య 339కి చేరుకుంది. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 762 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఆ తర్వాత రంగారెడ్డి 171, మేడ్చల్ 85, సంగారెడ్డి 36, ఖమ్మం 18, కామారెడ్డి 23, మెదక్ 22, నల్గొండ 32, ఆదిలాబాద్ 14, సూర్యాపేట 14, నారాయణ పేట 9, నిజామాబాద్‌‌లలో 8 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12,680 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 19,205 మంది కోలుకున్నారు. 

కాగా నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా సోకిన రోగులు నలుగురు మరణించడంతో బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ శుక్రవారం నాడు నారాయణ రెడ్డి సందర్శించారు. కరోనా రోగుల మరణంపై ఆయన వివరాలు సేకరిస్తున్నారు.

గత రెండున్నర నెలల కాలంలో ఈ ఆసుపత్రిలో సుమారు 10 మంది కరోనా రోగులు మరణించారు. కానీ 24 గంటల వ్యవధిలో నలుగురు కరోనా రోగులు మరణించడంతో కలకలం రేగింది.

మరణించిన నలుగురిలో ఇద్దరు కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వీరిద్దరూ మరణించారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఫ్యామిలీ మెంబర్లు ఆందోళనకు దిగారు.