హైదరాబాద్: తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం సృష్టించింది. పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 124 మందికి కరోనా సోకినట్టుగా వైద్యులు ప్రకటించారు. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు తరలించనున్నారు.

పోలీస్ అకాడమీలో 1900 మంది అభ్యర్ధులు శిక్షణ పొందుతున్నారు. అకాడమీలో పనిచేసే వంట మనిషికి తొలుత కరోనా సోకింది. ఆ తర్వాత  ఇక్కడ శిక్షణ పొందుతున్న వారిని పరీక్షిస్తే 124 మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. వెంటనే వీరిని ఐసోలేషన్ కు  తరలించారు.

అకాడమీలో హొంగార్డు, డీఐజీ స్థాయి అధికారులకు కూగ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా  కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 
రాష్ట్రంలో శనివారం నాడు ఒక్క రోజే 1087 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 13,436కి  చేరుకొన్నాయి. 

రాష్ట్రంలో నమోదౌతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ  పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంపై వాణిజ్య సంస్థల ప్రతినిధులు తమ సంస్థలను మూసివేస్తున్నారు. బేగంబజార్, జనరల్ బజార్, రాణిగంజ్ లలో దుకాణాలు మూసివేస్తున్నట్టుగా వ్యాపార సంస్థలు ప్రకటించారు.