హైదరాబాద్: ఢిల్లీలో చిక్కుకొన్న  తెలుగు విద్యార్థులు తమను స్వంత రాష్ట్రాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు వందలాది మంది విద్యార్థులు డిల్లీకి చేరుకొన్నారు. ఈ నెల 31వ తేదీన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జరగాల్సి ఉంది. 

లాక్ డౌన్ నేపథ్యంలో ఈ పరీక్షలు రాసేందుకు హాజరయ్యే పరిస్థితులు లేనందున పరీక్షలను వాయిదా వేయాలని కొందరు విద్యార్థుల నుండి డిమాండ్ రావడంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా యూపీఎస్‌సీ ఈ నెల 4వ తేదీన ప్రకటించింది. పరీక్షలు ఎప్పుడు నిర్వహించే విషయాన్ని మే 20వ తేదీన ప్రకటించనున్నట్టుగా కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల నుండి సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఢిల్లీలోనే ఉన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఢిల్లీలో మెస్ లు మూసివేశారు. అద్దె ఇళ్లలో ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు కూడ ఇబ్బందులు పడుతున్నారు. తమను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

also read:రైతుల సమస్యలపై కాంగ్రెస్ దీక్షలు: గాంధీ భవన్ లో ఉత్తమ్ సహా పలువురి నిరసన

ఢిల్లీలో చిక్కుకొన్న తెలుగు విద్యార్థులు తమను స్వంత గ్రామాలకు పంపేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు విద్యార్థులు వారి కుటుంబసభ్యులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరికొందరు ఈ వీడియోలను మీడియాకు పంపారు. 

 ఇదే విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కూడ కొందరు విద్యార్థులు తమను రాష్ట్రానికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.