హైదరాబాద్: రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు గాంధీ భవన్ లో దీక్షకు దిగారు. జిల్లాల్లో డీసీసీ కార్యాలయాల్లో పలువురు పార్టీ నేతలు కూడ దీక్షల్లో పాల్గొన్నారు. 

రైతుల సమస్యలను పరిష్కరించడంలో  రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

రైతుల సమస్యలతో పాటు, కరోనా వ్యాప్తిని అరికట్టడంలో వైఫల్యం, వలస కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం నాడు ఒక్క రోజు దీక్షకు దిగారు.

గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి,మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, వి. హనుమంతరావు తదితరులు దీక్షకు దిగారు. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ కాంగ్రెస్ నేతలు దీక్షకు దిగారు. ఆయా జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు దీక్షల్లో పాల్గొన్నారు. 

also read:డెలీవరి కోసం 200 కి.మీ: తల్లీ బిడ్డల మృతిపై సీరియస్, తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని పేదలకు తెల్ల రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కూడ నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యానికి బదులుగా నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నాణ్యమైన బియ్యంతో పాటు రేషన్ బియ్యం శాంపిల్స్ ను కూడ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు.పేదలకు ఇస్తున్న 12 కిలోల బియ్యంలో కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలు కూడ ఉన్న విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారు.

ధాన్యం కొనుగోలు  చేయాలని రాష్ట్రంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వం ఇకనైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు.